calender_icon.png 3 September, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహిత్యాభిలాషుల కూడలి

01-09-2025 01:47:14 AM

హైదరాబాద్ రామ్‌కోఠిలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం తెలంగాణ ప్రాంతంలో వందేళ్ల సాహిత్య వారధిగా నిలుస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి గ్రంథాలయం ఇదే. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత 2016 జూన్ 29న ఈ నిలయం శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంగా పేరు మార్చుకున్నది.

ఈ ప్రాంత సాహితీ వికాసంలో భాషా నిలయం కీలక పాత్ర పోషించింది. వ్యవస్థాపకులు నాయని వెంకట రంగారావు, కొమ ర్రాజు వెంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు 1901 సెప్టెంబర్ 1న భాషా నిలయా న్ని ప్రారంభించారు. దీని స్థాపనతో నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం మొదలైంది. గ్రంథాలయం తెలంగాణ ప్రజల్లో చైతన్యం కలి గించింది. తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి కృషి చేసింది. నాటి నిజాం నిరంకుశ పాలనలో కనీసం మాతృభాష తెలుగును కూడా ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోలేని, సామాజిక, రాజకీయ పరిస్థితు ల్లో భాషాభిమానుల చర్చలకు, సమావేశాలకు భాషా నిలయం ప్రధాన వేదికైంది.

ఆ రోజుల్లో ఉర్దూకు ప్రత్యామ్నాయంగా మరో భాష గురించి ఎవరైనా ఆలోచిస్తే వారిపై ‘యాంటీ- ఉర్దూ’ అని, ‘యాంటీ- నిజాం’ అనే ముద్ర వేసేవారు. ఈ విషయాన్ని తెలంగా ణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఎన్నోసార్లు సభల మాధ్యమంగా ప్రకటించారు. అలాంటి పరిస్థితుల్లో నాటి యువత తెలు గు సాహిత్యం, చరిత్ర చదువుకునేందుకు భాషానిలయం ఎంతో ఉపయోగపడింది. ప్రస్తుతం గ్రంథాలయంలో సుమారు 53,000 పుస్తకాలు ఉన్నాయి.

తెలుగు, సంస్కృత భాషల్లో పురాణాలు, వేదాలు, కావ్యాలు, నాటకాలు, నవలలు, సాహిత్య విమర్శ, విజ్ఞానశాస్త్ర గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. భ్రాషానిలయమంటే కొందరు దీనిని గ్రంథాలయమని అనుకుంటారు. మరికొందరు సాహిత్యాకారులు, సాహిత్యప్రేమికులు ఉపన్యాసాలు, చర్చలు జరిగే వేదికగా భావిస్తారు. దీనికి గ్రంథాలయం అని పేరు పెట్టకుండా వ్యవస్థాప కులు ‘భాషా నిలయం’ అని నామకరణం చేయడంలోనే ప్రత్యేకత ఉందని తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అభిప్రా యం.

వ్యవస్థాపకులు కేవలం పుస్తకాలు సేకరించడమే కాకుండా, తెలుగు భాషా వికా సానికీ దోహదపడాలని, పోతన జన్మించిన తెలంగాణ గడ్డపై మళ్లీ మరో పోతన అవతరించే పరిస్థితులు కల్పించడమే ధ్యేయంగా భాషా నిలయం నెలకొల్పినట్లు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. విజ్ఞానాన్ని పంచే పుస్తకాలతో పాటు ప్రధానంగా భాషను కాపాడ టం, అభివృద్ధి చేయడమనే బాధ్యతను కూ డా ఈ నిలయం నిర్వర్తిస్తుంది’ అంటారు. 

రావిచెట్టు రంగారావు కృషి..

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి పేరు పెట్టింది కొమర్రాజు లక్ష్మణరావు అయినప్పటికీ, ‘భాషానిలయం’ అనే ఆలోచన చేసింది మాత్రం రావిచెట్టు రంగారావే. మూలధనంపై వచ్చే వడ్డీతో ప్రతి సంవత్స రం కొత్త పుస్తకాలను కొని సంస్కృత గ్రం థాలయాన్ని అభివృద్ధి చేసేవారు. భాషానిలయ వ్యవస్థను, విధి విధానాలను రంగారావే రూపొందించారు. తాను స్వయంగా భాషానిలయానికి కార్యదర్శిగా పనిచేసి మరింత అభివృద్ధి చేశారు.

నగరంలో తెలుగేతర భాషానిలయాలు వెలవడటాన్ని చూసిన రావిచెట్టు రంగారావు.. తెలుగు భాషకూ ఒక భాషా నిలయం ఉండాలనుకున్నారు. అనుకున్న విధంగానే పలువురి మద్దతు కూడగట్టి భాషానిలయాన్ని నెలకొల్పారు. హైదరాబాద్‌లో కోర్టు కేసుల వల్ల మునగా ల రాజా నాయని వెంకట రంగారావు, ఆయన దివాన్ కొమర్రాజు లక్ష్మణరావు తరచుగా హైదరాబాద్ వచ్చేవారు. రంగారావుకు వీరితో పరిచయం ఏర్పడి, అది కాస్త భాషానిలయం ఏర్పాటుకు దారులు పడే లా చేసింది.

కేవలం భాషానిలయాన్ని నెలకొల్పడం మాత్రమే కాదు.. దానిని దినది నాభివృద్ధి చేయాలనే సంకల్పంతో రావిచెట్టు రంగారావు ప్రణాళిక రూపొందిం చారు. ప్రతిరోజూ ఉదయం ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి భాష గొప్పత నాన్ని, భాషానిలయ లక్ష్యాలను తెలిపే వారు. వారిని భాషా నిలయ సభ్యులుగా చేర్చేవారు. మొహమాటం లేకుండా వారి నుంచి సభ్యత్వ రుసుము వసూలు చేసేవారు. కేవలం తానే కాకుండా భాషానిలయ సభ్యులను సైతం సగౌరవంగా సాహితీ సమావేశాలకు తీసుకొచ్చేవారు. 

రంగారావుకు నల్లగొండలోని దండంపల్లిలో వందల ఎకరాల సాగుభూమి ఉంది. వరంగల్ జిల్లా ములుగు ప్రాంతంలో వతన్‌దారీ భూము లు దండిగా ఉన్నాయి. ఆయనకు మున్సబ్‌దార్, జాగీర్దార్, వతన్‌దార్ లాంటి ఎన్నో హోదాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయ న ఎప్పుడూ అహంకారాన్ని గాని, గర్వాన్ని గాని ప్రదర్శించలేదు. తెలుగు భాషకు నాడు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ముస్లిం, క్రైస్తవ మతస్తులను సైతం భాషానిలయంలో సభ్యులుగా చేర్పించారు.

తెలుగులో మంచి పుస్తకాలు లేవని ఎగతాళి చేసేవారికి భాషానిలయం నుంచి మంచి పుస్త కాలు పంపించి మరీ, వారితో వాటిని చదివేలా చేసేవారంటే ఆయన నిబద్ధత ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1908 సెప్టెంబర్‌లో మూసీ వరదల బీభత్సం భాషా నిలయాన్ని ఆర్థికంగా దెబ్బతీసినప్పటికీ, రం గారావు మనోస్థుర్యైంతో భాషానిలయాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే 1910 జూలై 3 అంతుచిక్కని వ్యాధితో ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత సభ్యులంతా కలిసి రంగారావు జ్ఞాపకార్థం సొమ్ము సేకరించి ఒక భవనం నిర్మించాలని తీర్మానం చేశారు.

నాలుగేళ్లయినా అడుగు లు ముందుకు పడకపోవడంతో రావిచెట్టు రంగారావు సతీమణి లక్ష్మీనరసమ్మ స్వయం గా భవనం కట్టించేందుకు పూనుకొన్నారు. ప్రస్తుత భవనం ఉన్న స్థలంలో ఉన్న ఇంటి ని ఆమె రూ.2700కు కొనుగోలు చేశారు. ఆ ఇంటినే భాషానిలయంగా మార్పులు చేయాలని సభ్యులు భావించినప్పుడు లక్ష్మీనరసమ్మ కొత్త భవనం నిర్మించాల్సిందేనని పట్టుబట్టారు. మరో రూ.3 వేల ఆర్థిక సా యం అందించారు. చివరకు భవన నిర్మా ణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది.

శ్రీకృష్ణదేవరాయల పేరే ఎందుకంటే..

విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల పాలన అత్యున్నత స్థాయిలో ఉండే దని చరిత్రకారులు చెప్తుంటారు. రాయలవారి పాలనను చూసిన ఇద్దరు పోర్చుగీస్ యాత్రికులు ఆ వైభవాన్ని చరిత్రలో రికార్డు చేశారు. వారి రచనల్లో తెలుగు భాషా వికాసాన్ని, అష్టదిగ్గజాలతో భువనవిజయం నిర్వహించిన తీరును వర్ణించారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన రాబర్ట్ సూవెల్ అనే ఐసీఎస్ అధికారి ఆ చరిత్రను వెలికి తీసి 1900లో ఆంగ్లంలో పలు పత్రికలకు వ్యాసాలు రాశారు. వాటిని రావిచెట్టు రంగారావు, నాయని వెంకట రంగారావు, కొమ ర్రాజు లక్ష్మణరావు చదవడం తటస్థించింది. గత కాలపు తెలుగు భాషా వైభవాన్ని మరొకసారి తీసుకురావాలనే కలలు గని ఈ త్రయం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని స్థాపించారు. 

ఈ విషయాన్ని 1952 స్వర్ణోత్సవాల్లో నాయని వెంకటరంగారావు గుర్తుచేసుకుం టూ.. ‘నిజాం రాష్ట్రంలో తెలుగు భాష స్థితిని తలచుకుని మేం ముగ్గురం ఆవేదన చెం దాం. ప్రజల మాతృభాషకు ఇంత దుర్గతి పట్టిందే అని బాధపడ్డాం. ఎలాగైనా తెలుగు భాషకు పునః వైభవాన్ని తిరిగి సాధించాలనే సంకల్పంతో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించాం’ అని వెల్లడించారు.

తెలుగు భాషా వికాసానికి భాషానిలయం చేస్తున్న కృషిని గుర్తించిన వనపర్తి, గద్వాల, పాల్వంచ, బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాధీశులు తమకు తోచిన సహాయ సహకారాలు అందించడం మొదలుపెట్టారు. భాషానిల యం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికీ దోహదపడింది. విద్యాదానం చేస్తామని వాగ్దానాలు చేసిన వారు పట్టించుకోనప్పటికీ, వ్యవస్థాపక త్రయం స్వయంగా సొమ్ము సేకరించేవారు. అవసరమైతే చందాల కోసం ఇంటింటికీ తిరిగేవారు. ఆ సొమ్ముతో ఒక ఉపాధ్యాయుణ్ణి నియమించారు.  

ఉత్సవాల నిర్వహణ..

1927 ఫిబ్రవరిలో కావ్యకంఠ గణపతి శాస్త్రి అధ్యక్షతన భాషా నిలయం రజతోత్సవాలు జరిగాయి. 1952 సెప్టెంబర్‌లో నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన స్వర్ణోత్సవాలు జరిగాయి. 1962లో నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షతన వజ్రోత్సవాలు జరిగాయి. 1977లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అధ్యక్షతన అమృతోత్సవాలు జరిగాయి. 2002 సెప్టెంబర్‌లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఏళ్లు గడుస్తున్నా భాషానిలయం ఇప్పటికీ సాహిత్యకారుల కూడలిగానే నిలుస్తున్నది.