01-09-2025 01:45:34 AM
స్వర్గాన్ని దివి నుం చి భువికి చేర్చే శక్తి సంగీతానికి ఉందని నానుడి. ఆంగ్ల రచయిత ఎమిల్ లుడ్విగ్ చెప్పినట్లుగా భూ లోక వాసులను స్వర్గానికి ఎగరేసుకుపోయే శక్తి సంగీతానికి ఉందన్న నిజం సంగీత ప్రియుల కు మాత్రమే తెలుస్తుంది. ఒక్క సంగీతమే కాదు కవిత్వం కూడా ఆ కోవకు చెందినదనే విషయం కవితాప్రియులకు మాత్రమే తెలుస్తుం ది.
అన్ని కవిత్వాలకు ఆ శక్తి ఉంటుందో లేదో తెలియదు గానీ, పాఠకుల హృదయాలను దోచుకునే కవిత్వానికి మాత్రం అలాంటి శక్తి కచ్చితంగా ఉం టుంది. భావాత్మక కవిత్వం చదువుతున్నప్పుడు పాఠకుడు తనకు తెలియకుండానే అందులో లీనమై అలౌకికానందా న్ని, తాదాత్మ్యాన్ని పొందుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దీన్నే ‘రసానందం’ అంటాం. సంగీతానికే కాదు భూలోక పాఠకులను స్వర్గంలో విహరింపజేసేశక్తి కవిత్వానికి కూడా ఉందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఒక కవిత చదివితే పాఠకుని మనసులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి.
అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలమై విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగ ర మథనం జరిగినట్లుగా భావ మథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరదు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు కవితా వస్తువు ఏదైనా, అమ్మజోల పాట పాడితే చంటిపాప నిద్రలోకి జారుకున్నట్లుగా పాఠకుడు కవిత్వాన్ని తనివితీరా ఆస్వాదించేలా కవి ప్రతిభాశైలి ఉండాలి. అలాంటి కవిత్వం రాసేవారు ఈమధ్యకాలం లో చాలా అరుదుగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం వేలకొద్దీ కవితా సంపుటాలు వెలువడుతున్నా వాటిలో కొన్ని మాత్రమే పాఠకులను ఆకట్టుకుంటున్నాయి.
కవిత్వం పట్ల పాఠకుడికి రసజ్ఞత కలగాలంటే, కవి సందర్భానుసారంగా కథావస్తువును కళ్లకు కట్టే విధంగా, మనసును రంజింపజేసే విధంగా కవిత్వీకరించాలి. అప్పుడే కవి పాఠకుల హృద యాంతరాల్లోకి చేరుకోగలడు. ఇటీవల ‘మహతీ సాహితీ కవిసంగమం’, కరీంనగరం వారి ‘ధనుర్మాస కవితోత్సవం 2024- సందర్భంగా వైవిధ్య వ్యాస రచయిత యేచన్ చంద్రశేఖర్ మస్తిష్కం నుంచి పురుడుపోసుకున్న ‘కవన చంద్రికలు’ ఆ కోవకు చెందినవే.
కమ్మనైన అమ్మపాట ఎంత మధురమో ‘కవన చంద్రికలు’లో రచయిత ‘యేచెన్ చంద్రశేఖర్’ రాసిన అమ్మ కవిత్వం కూడా అంతే మధురం గా అనిపిస్తుంది. చంటిపిల్లలు అన్నం తినేందుకు మారాం చేస్తే ‘చందమామ రావే, జాబిల్లి రావే’ అంటూ అమ్మ చందమామను చూపించగానే, బిడ్డ కడుపు నిం డా భోజనం చేసినట్లు, చందమా మ పాటవలె మృదు మధురంగా అమ్మ కవితకు అక్షరరూపం కల్పించారు చంద్రశేఖర్. ఈ పుస్తకంలో ‘జీవన సౌరభాలు’, ‘స్వాతంత్య్ర సమరయోధులు’ అనే రెండు విభాగాలున్నాయి.
అమ్మదనంపై స్వచ్ఛమైన కవిత్వం..
‘జీవన సౌరభాలు’ విభాగంలోని ‘సకల సౌభాగ్యాల పరమావధి కన్నతల్లి’ అన్న కవితలో ‘అడగకుండా బిడ్డ ఆకలిని తెలుసుకునేది తల్లి.. బిడ్డ ఆకలి తీర్చడానికి పస్తులుండేది తల్లి’ అని, ప్రపంచంలో అడగకుండానే బిడ్డ ఆకలిని గుర్తించే ఏకైక వ్యక్తి కన్నతల్లి మాత్రమే.. అనే అక్షర సత్యాన్ని అందమైన పదాల పొందికతో పాఠకుడికి పసందైన విందు అం దించారు. ఈ కవిత చదివిన ప్రతి పాఠకుడి మదిలో కన్నతల్లిపై మమకారం ఉప్పొంగుతుంది.
తల్లిప్రేమను వివరించిన తీరు వహ్వా అనిపిస్తుంది. మరో కవితలో ‘జీవం పోసేది అమ్మ అయితే.. జీవితం ఇచ్చేది నాన్న’, ‘జీవితపు నాణేనికి అమ్మ బొమ్మ అయితే.. బొరుసు నాన్న’ అని కడదాకా తనకోసం, తన సుఖ సంతోషాల కోసం ఏనాడూ ఆలోచించక జీవితమంతా కన్నబిడ్డల కోసం పరితపించే ‘నాన్న’ గురుంచి ఎంతో అద్భుతంగా చెప్పారు కవి. ఈ సంకలనంలోని ఒక్కో కవిత చదువుతూ, పాఠకుడు తాను కూడా కవిత్వం రాయాలన్న ఉద్విగ్నతకు లోనవుతాడు.
పాఠకులను మంత్రము గ్ధులను చేసే ప్రాసతో కవిత్వం రాయడం యేచెన్ చంద్రశేఖర్‌కే సాధ్యం అనే భావన ఏర్పడుతుంది. ఈ పుస్తకంలోని 49 కవితలు సరళమైన శైలిలో సామాన్య పాఠకులకు సైతం కవిత్వంపై అనురక్తి కలిగించే విధంగా ఉన్నాయి. ‘సుఖం మరిగిన మనిషి’ కవితను గమనిస్తే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఆధునికత’ పేరుతో మనిషి సుఖాలకు అలవాటుపడుతూ యాంత్రికంగా మారుతున్న విషయాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు.
మనిషి సుఖాలకు అలవాటుపడి, శారీరక శ్రమ లేక రోగాల పాలవుతున్నాడు. సమాజంలో మార్పు రావాలి. కానీ, ఆ మార్పు వలన మనిషికి ప్రయోజనం కలగాలి తప్ప పరాభవం, పతనం కాకూడదన్న విష యాన్నీ కవిత రూపంలో చెప్పడమనేది గొప్ప విషయం. ‘కాయాకష్టం మరిచాడు మనిషి.. సోమరిగా మారిపోయా డు మనిషి’ అని ఆయన వాపోవడం ముమ్మాటికీ వాస్తవమే కదా! ఒకానొకప్పుడు మనిషి మూడుపూటల అన్నం కోసం కష్టపడి పని చేసేవాడు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
ఉచితాలకు అలవాటుపడి కష్టాన్ని మరచిన మాట వాస్తవమే. సుఖం మరిగిన మనిషి గురుంచి ఎన్నో విషయాలను కవి తన కవితలో ప్రస్తావించారు. ‘ఛిద్రమవుతు న్న బతుకు చిత్రం’ కవితలో ‘కరోనా’ సంక్షోభ సమయంలో బడుగుల బతుకు కష్టాలను వివరిస్తూ ‘ఛిద్రమవుతున్నాయి బడుగుల బతుకులు.. మానలేదింకా కరోనా రేపిన గాయా లు’, ‘అంతలోనే విరుచుకుపడిన ధరల శరాఘాతాలు.. ఆకాశాన్నంటే ధరలతో తప్పట్లేదు వెతలు’ అంటూ వాపోతారు.
కరోనా ప్రభావంతో సామాన్యుడు చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తోంటే, ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు పెను భారాన్ని మోపుతున్నాయని, అరకొర సంపాదనతో జీవితాలు కుదేలవుతున్నాయని అయినా బడుగు జీవులు సంసారసాగరం ఈదడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారని కవిత ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్నేహం’ కవితలో ‘అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తమే స్నేహం.. చెమర్చిన కన్నులలో చెదిరిపోని జ్ఞాపకమే స్నేహం’ అంటూ, ఈ సృష్టి లో స్నేహానికి మించిన గొప్ప వరం మరొకటి లేదంటారు రచయిత.
బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి మనిషికి కష్టసుఖాలలో తోడుగా నిలుస్తూ కడదాకా, కాటి దాకా తోడుగా వచ్చేది స్నేహం ఒక్కటే. కష్ట సుఖాలలో మార్గాన్ని చూపే మార్గదర్శి స్నేహితుడు. అందుకే మంచి స్నేహితున్ని మించిన ఆస్తి లేదంటారు. మన జీవితంలో సంపదకన్నా అత్మీయతానురాగాలతో కూడిన స్నేహం దొరకడం గొప్ప వరం. స్నేహానికి ఎల్లలు, కులం, మతాలుండవు. ‘స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా’ అనే అక్షర సత్యాన్ని స్పష్టంగా వివరించారు కవి.
రెండో భాగం ‘స్వాతంత్య్ర సమరయోధులు’ విభాగంలోని 37 కవితలు.. చరిత్ర అట్టడుగు పుటల్లో సైతం చోటు సంపాదించుకోని స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను తన కవితల్లో చాటిచెప్పారు కవి. మొత్తానికి ‘కవన చంద్రికలు’లోని ప్రతీ కవిత దేనికది ప్రత్యేకం. ప్రతీ కవిత కూడా పాఠకుడిని భావుకతకు గురిచేసేలా రాయడం కవి రచనాశైలికి నిదర్శనం. చదివిన ప్రతి పాఠకుడు, కలం చేతబట్టి తన హృదయంతరాల్లో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోయాలనే ప్రేరణ కలిగించేలా సాగింది యేచన్ చంద్రశేఖర్ కవితల సంకలనం.
ప్రతులకు సంప్రదించాల్సిన నంబర్ 88850 50822