30-09-2025 01:30:42 AM
అనుష్క శెట్టి కల నెరవేరబోతోందా..? మెగాస్టార్ చిరంజీవి సరసన అనుష్కను పూర్తిస్థాయి హీరోయిన్‌గా చూసే భాగ్యం అభిమానులకు కలుగనుందా? అంటే, ఇండస్ట్రీలో ఇప్పుడు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిరంజీవి 158వ చిత్రం దర్శకుడు బాబీ లాక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో తెరకెక్కనున్న సినిమాను వచ్చే ఏడాది పట్టాలెక్కించనున్నారు. అయితే, ఇందులో కథానాయికగా అనుష్కను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే డైరెక్టర్ బాబీ.. అనుష్కను సంప్రదించారని సమాచారం. అనుష్క సైతం పాజిటివ్‌గానే స్పందించిందని టాక్. చిరంజీవితో తెరను పంచుకోవాలని అనుష్క చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేశ్‌లతో కలిసి నటించిన స్వీటీ..
చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌లతో నటించే అవకాశాన్ని అందుకోలేకపోయింది. ఒక్క ‘స్టాలిన్’లో మాత్రం ఓ ప్రత్యేక గీతంలో చిరుతో కలిసి స్టెప్పులేసింది అనుష్క. దాంతో సంతృప్తి పడని స్వీటీ.. ఓ సందర్భంలో మీడియా ముఖంగా తనకు చిరంజీవితో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టింది.
ఎట్టకేలకు బాబీ చొరవతో చిరు కాంబినేషన్ సెట్ కానుందని తెలుస్తోంది. అన్నీ కుదిరి చిరు కలయికలో సినిమా వస్తే.. అనుష్క ‘మెగా’ డ్రీమ్ తీరడంతోపాటు బొమ్మ బ్లాక్‌బస్టర్ పక్కా అంటున్నారు ఫ్యాన్స్.