15-09-2025 12:00:00 AM
సామాన్యుల జీవనంలోని అనుభవాలు, భావాలను సంక్షిప్తంగా, లయబద్ధంగా చెప్పే సంప్రదాయ కవిత్వ ప్రక్రియ నానీ. నానీల్లో ప్రతి పాదం చివర ప్రాస ఉండటం వల్ల శ్రవణ సౌందర్యం పెరుగుతుంది. నానీల్లో ఉపమానాలు, రూపకాలు జీవన సత్యాలను సులభంగా అర్థమయ్యేలా, హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. వీటిలో ఉపయోగించే భాష సరళంగా ఉంటుంది. ప్రాస ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో కవిత్వం రాసే కవులు తమ చుట్టూ ఉన్న జీవితాలను, సామాజిక అంశాలను, ప్రకృతి పట్ల ప్రేమను వ్యకీకరిస్తారు. ఇదే కోవలో కవి కుడికాల వంశీధర్ ‘సాఫ్ట్‌వేర్ జీవితాలు’ అనే ఒకే అంశం తీసుకుని నానీలు రాశారు. అలాంటి ప్రయోగం నిజంగా సాహసమే.
సాఫ్ట్‌వేర్ జీవితాలను తెలుగు కవిత్వంలోకి తీసుకువచ్చి వంశీధర్ కృతకృత్యులయ్యారు. విదేశీ సంస్కృతిపై మోజు, పెరుగుతున్న వస్తువుల ధరలు వంటి సమకాలీన అంశాలను కవి వ్యంగ్యంగా, చమత్కారంగా తన నానీల్లో చిత్రించారు. ఈ సంపుటి సాఫ్ట్‌వేర్ పరిశ్రమను కేంద్రంగా చేసుకుని, మానవీయ భావాలు, సామాజిక వాస్తవాలను సమతుల్యంగా ఆవిష్కరిస్తుంది. సాఫ్ట్‌వేర్ రంగంతో మానవ సంబంధాలు, సామాజిక మార్పులను సమన్వయపరిచి 200 నానీల సంపుటిని అందించారు కవి. ‘బ్యాగులోకి / దూరుతున్న ల్యాప్‌టాప్ / భూగోళం / తాబేలులా ముడుచుకున్నట్టు’ అనే నానీ సాంకేతికత ఆధిపత్యాన్ని సమర్థంగా వ్యక్తం చేస్తుంది.
సాఫ్ట్‌వేర్ జీవితంలోని అనుభవాలను, ‘కొన్ని పరిచయాలు / దూరమవుతాయి/ వాడని / పాస్‌వర్డ్ మరచిపోయినట్టు’ వంటి నానీలు మానవ సంబంధాల క్షీణతను ఆవేదనతో చిత్రిస్తాయి. ‘గూగుల్‌లో అన్నీ /దొరుకుతాయి. ఆమె దుఃఖానికి/ కారణం తప్ప..’ అంటారు కవి ఒకచోట. ‘గూగుల్’ లాంటి ఆధునిక పదం, ‘దుఃఖం’ వంటి అచ్చ తెలుగు పదాలతో నానీలు నిండి ఉండటం ప్రత్యేక ఆకర్షణ. ఆధునికత, సంప్రదాయం మధ్య వైరుధ్యాన్ని సృష్టిస్తాయి ఈ నానీలు. ఒక నానీ ఉండేది నాలుగు లైన్లు మాత్రమే అయినా, పాఠకులపై అమితమైన ప్రభావం చూపుతాయి.
ఆధునిక యుగంలో స్త్రీ మూర్తి మనోవేదనకు పరిష్కారం దొరకలేదనే నిగూఢమైన విషయాన్ని సులభంగా చెప్పారు కవి. సామాన్యుని జీవన శైలికి అద్దం పట్టేలా ‘కంట్రోల్ ఆల్ డిలీట్ /కంప్యూటర్ వరకే/ కష్టాలను దాటే /వేతన జీవికి కాదు’ అంటూ కవి ఒక నానీలో వాపోతారు. సాంకేతికత సామాన్య మానవుని జీవితంలో తీసుకువచ్చిన సంఘర్షణలను వివరిస్తారు. ‘కష్టాలు ఒక బటన్ నొక్కితే తొలగిపోవు’ అనే విషయాన్ని అనే నానీల్లో చక్కగా వివరించారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సంబంధాన్ని ‘హార్డువేరే / సాఫ్టువేర్‌కు కవచం / కొబ్బరి చుట్టూ / పెంకులా’ అని ఓ నానీలో పోల్చి కవి చమత్కరిస్తారు. ‘కంప్యూటర్లను / కలుపుతుంది అంతర్జాలం / భావాలు కలపడ మే / జటిలం’ అనే ఓ నానీలో తేల్చిచెప్తారు కవి. ఇలా ఈ నానీల సంపుటి సాంకేతికత, మానవత్వం మధ్య సంబంధాలను చక్కగా అల్లిన ఆధునిక కవిత్వం.