23-11-2025 01:01:16 AM
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న మంచు మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారాయన. ఇందులో భాగంగా తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ మంచు మనోజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఓ ఎమోషనల్ మైల్‌స్టోన్ అనే చెప్పాలి.
వెండితెరపై తనదైన నటన, పాత్రలతో విలక్షణ నటుడుగా తెలుగు సినిమాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మనోజ్. బాలనటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. బిందాస్, కరెంట్ తీగ, పోటుగాడు వంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌తోపాటు ప్రయోగ్రాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. సినిమాల్లో తన అభిరుచిని నటనలోనే కాకుండా సొంతంగా స్టంట్స్ కంపోజ్ చేయటం, సెట్స్ రూపకల్పనలో భాగమవటం, గుర్తుండిపోయే పాత్రను రూపొందించటంలో ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు.
ప్రారంభం నుంచి మంచు మనోజ్ జీవితంలో సంగీతం అనేది ఓ అంతర్భాగంగా ఉంటోంది. ఎందుకంటే ‘పోటు గాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయానే..’ పాట పాడి ప్రేక్షకులను మెప్పిం చారు. కోవిడ్ సమయంలో అందరినీ ఉత్తేజరపరిచేలా ‘అంతా బాగుంటాంరా’ పాటను విడుదల చేశారు. ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలో ‘పిస్తా పిస్తా.. ’ పాటతో పాటు ‘నేను మీకు తెలుసా’ సినిమాలో ‘ఎన్నో ఎన్నో..’, ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో ‘ప్రాణం పోయే బాధ..’ పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఆయన హదయానికి హత్తుకునేలా, భావోద్వేగంతో కూడుకున్న, విలక్షణమైన గాత్రం ఆయనలోని సహజమైన సంగీత ప్రతిభను తెలియజేస్తోంది.
‘మోహన రాగ మ్యూజిక్’ అనేది కొత్త ఆలోచనలు, భావోద్వేగాలను కలిపే వేదిక. ఈ కంపెనీతో మంచు మనోజ్ ఒక కొత్త సృజనాత్మక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటం, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం.. భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం.
ఈ పేరుకీ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. తండ్రీ కొడుకులిద్దరికీ అత్యంత ఇష్టమైన రాగం.. మోహన రాగం! ఒరిజినల్ సింగిల్స్, కొలాబ్రేషన్స్, కొత్త రకమైన మ్యూజిక్ ప్రాజెక్ట్స్ ఈ లేబల్ నుంచి రాబోతున్నాయి. మోహన రాగ మ్యూజిక్ కంపెనీతో జరగబోయే అతి పెద్ద ఇంటర్నేషనల్ కొలాబ్రేషన్ గురించి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇది తెలుగు సంగీతాన్ని ప్రపంచ వేదిక పైకి తీసుకెళ్లే కీలకమైన పరిణామంగా నిలుస్తుంది.
తెరపై పాటలు పాడటం, రాయటం వంటి సంగీత సంబంధమైన విషయాలే కాదు.. తెర వెనుక ఎన్నో విశేషమైన సేవలను అందించారు. మనోజ్ తన సినీ ప్రయాణంలో తండ్రి డాక్టర్ మంచు మోహన్‌బాబు, అన్నయ్య మంచు విష్ణు, సోదరి లక్ష్మి మంచు చిత్రాలకు సంగీత విభాగంలో పనిచేయటంతోపాటు వారి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ కూడా చేశారు.
తన కుటుంబ సభ్యులు నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలను పాడారు. అంతర్జాతీయ స్థాయిలో తన గుర్తింపును పెంచుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణితో కలిసి హాలీవుడ్ సినిమా ‘బాస్మతి బ్లూస్’కు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో కెప్టెన్ మార్వెల్ పాత్ర పోషించిన బ్రీ లార్సన్ ప్రధాన పాత్రలో నటించారు.