23-11-2025 01:03:30 AM
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు పీ దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ స్వరపరిచిన సంగీతం ఈ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తోంది.
ఈ సందర్భంగా మేకర్స్ శనివారం రాత్రి వైజాగ్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత అతిథిగా హాజరైన ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో హీరో రామ్ పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ కాన్సర్ట్‌లో హీరో రామ్ మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో గర్వపడే సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. వివేక్ తెలుగు సినిమాకు ఒక కొత్త సౌండ్ తీసుకొచ్చారు. ఈ ఆల్బమ్ గుండెల్లో నిలిచిపోతుంది.
మహేశ్‌లాంటి హానెస్ట్ ఫిలిం మేకర్స్ తెలుగు సినిమాకు కావాలి. 25 ఏళ్ల క్రితం చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి, ఉపేంద్ర సినిమా చూసి తన మనసు మార్చుకుని ధైర్యంగా నిలబడి ఒక కంపెనీ పెట్టి వందల మందికి ఉద్యోగాలిచ్చాడు. ఉపేంద్రతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. జీవితంలో పైకి రావాలంటే పాషన్, పర్పస్ ఉండాలి. నా పర్పస్ అభిమానులే” అన్నారు. ‘ఈ సినిమా చూసి మీరు అందరూ కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తార’ని ఉపేంద్ర చెప్పారు.
హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ.. “నా చిన్ని గుండెలో చాలా ఆశలతో ఇక్కడికి వచ్చాను. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. రామ్ అభిమానుల్ని ఎంతగానో ప్రేమించే హీరో. ఆయన కింగ్ ఆఫ్ హార్ట్స్. మీ అందరి ప్రేమకు ఆయన అర్హులు” అన్నారు. డైరెక్టర్ మహేశ్‌బాబు మాట్లాడుతూ.. “నేను సినిమా తీయడం హైదరాబాదులో నేర్చుకున్నా. కానీ సినిమాలో ఉండే ప్రతి ఎమోషన్ వైజాగ్‌లోనే ఫీలయ్యా. ప్రొడ్యూసర్ రవికి కథ చెప్పినప్పుడు ఆయన నన్ను కౌగిలించుకున్నరు. అప్పుడే కంటెంట్‌పై మరింత నమ్మకం వచ్చింది.
ఒక డైరెక్టర్‌ను డైరెక్ట్ చేయడం చాలా కష్టమైన పని.. ఉపేంద్ర దగ్గరికి చాలా భయంతో వెళ్లాను. ఆయన సపోర్ట్‌ను మర్చిపోలేను. రామ్ లేకపోతే సినిమా లేదు. సినిమా పట్ల అంత ఫ్యాషన్ ఉన్నవారిని నేను ఇప్పటివరకూ చూడలేదు. ప్రపంచంలో ఎవర్నో ఒకరిని అభిమానించకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. జీవితంలో ఎన్ని రకాల భావోద్వేగాలుంటాయో ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్‌వ్యూలో చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా” అని తెలిపారు. ‘ఒక మెసేజ్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చెప్పడంలో కొరటాల శివ దిట్ట.
ఈ సినిమా దర్శకుడు మహేశ్ కూడా నెక్స్ కొరటాల శివ అవుతాడ’ని నిర్మాత రవిశంకర్ చెప్పారు. సంగీత దర్శక ద్వయం వివేక్ మాట్లాడుతూ.. “మాకు ఇంత మంచి గొప్పగా స్వాగతం పలికిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఉపేంద్రకు మేము పెద్ద ఫ్యాన్స్. ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మ్యూజిక్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం రామ్. ఆయన మాకు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేం” అన్నారు.