calender_icon.png 24 December, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజక్షన్ వికటించి గర్భిణి మృతి

24-12-2025 02:11:33 AM

  1. చైతన్యపురిలోని మంజుసుధ హాస్పిటల్‌లో దారుణం

వైద్య పరీక్షల కోసం వస్తే గర్భిణి ప్రాణం తీశారు

చర్యలు తీసుకోని మేడ్చల్ మల్కాజిగిరి డీఎంహెచ్‌వో

ఎల్బీనగర్, డిసెంబర్ 23 : వైద్య పరీక్షల కోసం దవాఖానకు వచ్చిన గర్భిణికి అబార్షన్ ఇంజక్షన్ ఇచ్చి, ప్రాణాలు తీసిన ఘటన చైతన్యపురిలోని మంజు సుధా హాస్పిటల్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం దవాఖానకు వచ్చిన గర్భిణికి అబార్షన్ ఇంజక్షన్ ఇచ్చి, ప్రాణాల మీదకు తెచ్చారు. గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు మరో దవాఖా నకు తరలించినా పాణాలు నిలవలేదు.

మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డతండాకు చెందిన ముదావత్ సునీత (22), భర్త హరిలాల్(25)తో కలిసి సైదాబాద్‌లోని కాజాబాగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా వైద్య పరీక్షల కోసం చైతన్యపురిలోని మంజుసుధ హాస్పిటల్ కు 10 రోజుల క్రితం వచ్చింది. గైనకాలజస్ట్ డాక్టర్ వైద్య పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చి సునీతను ఇంటికి పంపించారు. అయితే ఇంజక్షన్ వికటించడంతో అధిక రక్తస్రావం జరిగింది. వెంటనే తిరిగి హాస్పిటల్ కు వచ్చారు.

సునీత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఓవైసీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే కుటుంబసభ్యులు ఓవైసీ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించారు. మూడు రోజులుగా హస్పిటల్ లో ఉన్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మంగళవారం ఉదయం 4 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంజుసుధ హస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేయడంతోనే సునీత మృతి చెందినట్లు ఆరోపించారు.

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులతో కలిసి కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. పోలీసులు దవాఖానకు చేరుకుని న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చి, ఆందోళన విరమింప చేశారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు.