calender_icon.png 24 September, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే రంగారెడ్డిపై తిరుగుబాటు తప్పదు

24-09-2025 01:05:24 AM

కాంగ్రెస్ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం : కిషన్ రెడ్డి

తుర్కయంజాల్, సెప్టెంబర్ 23: ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు బొక్క మురళీధర్ రెడ్డిని కిషన్రెడ్డి పరామర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారన్న నెపంతో మురళీధర్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డి అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు.

ఏకంగా దేశం ద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపే కుట్రలు చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలు బయటికి వచ్చి తిరగబడటం ఖాయమని హెచ్చరించారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే అనేకమంది బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టారని అన్నారు. స్వయంగా స్థానిక ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్లు చేసి, బెదిరించి కేసులు పెట్టిస్తున్నారని కిషన్రెడ్డి ఆరోపించారు. అధికారులు, పోలీసులు తమ వృత్తికి లోబడి పనిచేయాలని, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గొద్దని కిషన్రెడ్డి హితవు పలికారు.

ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే రంగా రెడ్డి చేస్తున్న ఆరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఏమైనా మంచి చేస్తారేమోనని ఆశించి, రెండేళ్లు వేచి చూశామని అన్నారు. కానీ ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ అరాచకాలు పెచ్చుమీరిపోయాయని, ఇకపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇకపై ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. తమ సొంతవారికే కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మలక్ పేట ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్కు ఏకంగా రూ.63కోట్ల టెండర్ను ఎమ్మెల్యే ఇప్పించారని, ఇందులో 20శాతం పర్సంటేజీ తనకు ఇవ్వాలని మాట్లాడుకున్నారన్నారు.

మునగనూరులో రూ.150కోట్లు విలువచేసే భూమిని, యాచారం మండలం గున్గల్లోని సర్వే నెంబర్ 341లో పేదల భూములను కొల్లగొట్టే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ప్రాంతం చైతన్యానికి, ప్రజా పోరాటాలకు నిలయమని, కమ్యూనిస్టులకు అడ్డాగా ఉందని అన్నారు. ఇలాంటి ప్రాంతంలో మలక్ పేట రాజకీయాలు చేస్తానంటే కుదరదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.  గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, సామ సంజీవరెడ్డి, గుర్రం చంద్రశేఖర్ రెడ్డి, రొక్కం చంద్రశేఖర్ రెడ్డి, బొక్క గౌతమ్ రెడ్డి, కాకుమాను చిన్నయ్య, చెవుల దశరథ, రమావత్ కల్యాణ్ నాయక్, తాళ్లపల్లి మోహన్ గుప్తా, సాధు శ్రీనివాస్, రొక్కం ప్రభాకర్ రెడ్డి, ఏనుగు ఆనంద్ రెడ్డి, సంరెడ్డి సత్తిరెడ్డి, గుండ్ల రాజిరెడ్డి, గౌని రాజుగౌడ్, కొండ్రు శ్రీనివాస్, కొండ్రు మల్లేశ్, తుమ్మలపల్లి వెంకటరెడ్డి, శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.