08-08-2025 12:19:35 AM
తీసుకున్న అప్పు అడిగినందుకు మహిళ కిడ్నాప్
ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై కారులో తీసుకెళ్తుండగా యాక్సిడెంట్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
చేవెళ్ల, ఆగస్టు 7: రోడ్డు ప్రమాదం ఓ మహిళను కిడ్నాప్ నుంచి కాపాడింది. శంషాబాద్ రూరల్ ఇన్ స్పెక్టర్ నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన కొండకల్ల పద్మజ, బుచ్చయ్య దంపతులు అదే ఊరికి -చెందిన కమ్మెట విజయ్ గౌడ్ కు రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఇటీవల పద్మజ అడగగా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో విజయ్ గౌడ్ ఆమెపై పగ పెంచుకున్నాడు.
కాగా, పద్మజ భర్త బుచ్చయ్య అనారోగ్యంతో వారం నుంచి శంషాబాద్ మండలం మల్కారం గ్రామ పరిధిలోని ఆశా జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా దు. పద్మజ ఈ నెల 5న తన భర్తకు బట్టలు ఇచ్చేందుకు ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటలకు పండ్లు తీసుకొచ్చేందుకు బయటకు రాగా.. అక్కడే వేచి చూస్తున్న కమ్మెట విజయ్ గౌడ్, వెంకటేష్, సాయి ఆమెను కిడ్నాప్ చేసి బలవంతంగా కారులో తీసుకెళ్లారు.
కదిలే కారులో నుంచి దారిమధ్యలో తప్పించుకునేందుకు ప్రయత్నించగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్వాల్ గూడ సమీపంలో ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద ముందు వైపు వస్తున్న మరో వాహనాన్ని వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పద్మజకు గాయాలు కాగా ఎయిర్ పోర్టు పోలీసు సిబ్బంది శంషాబాద్లోని ఆర్కాన్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు. నిందితులు కూడా గాయపడడంతో చికిత్స పొందుతున్నారని అదుపులో తీసుకుంటామని విచారిస్తామని ఆయన వెల్లడించారు.