13-12-2025 12:00:00 AM
ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఒక్క తాటిపైకి రావాలి
విలేకరుల సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, డిసెంబర్ 12: బీఆర్‌ఎస్, బీజేపీ లోపాయికారీగా ఒక్కటై పోటీ చేశాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడారు. తన సొంత గ్రామం రంగారెడ్డిగూడలో కేవలం 13 ఓట్లు మాత్రమే సాధించిన బీఆర్‌ఎస్ నాయకులకు తనను విమర్శించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
రంగారెడ్డిగూడ ఒక్కటే తన ఊరుకాదని, నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లూ తనవేనని పేర్కొన్నారు.తొలివిడత ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా 50శాతానికి పైగా పంచాయితీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా బీఆర్‌ఎస్ చాలా చోట్ల కనీసం అభ్యర్థులను కూడా పోటీలో పెట్టలేకపోయిందని విమర్శించారు.
తొలి విడత పంచాయితీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజాపూర్ మండలంలోని తన సొంత గ్రామం రంగారెడ్డి గూడ లో బీజేపీ అభ్యర్థి గెలవడాన్ని ఎమ్మెల్యే గా తన ఓటమి అంటూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తప్పు పట్టారు. రంగారెడ్డిగూడలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి కేవలం 13 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేసారు.
గతంలో లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఆయన సొంత గ్రామం ఆవంచలో బీఆర్‌ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ 560 ఓట్ల మెజారిటీతో గెలుపొందలేదా? అని ప్రశ్నించారు. రంగారెడ్డి గూడ తన సొంత గ్రామం అని అక్కడ ఎవరు గెలిచినా వారు తన వాళ్లేనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రంగారెడ్డి గూడలో సర్పంచ్ గా గెలిచిన ఆనంద్ (రేవతి) గతంలో సర్పంచ్ గా, ఎంపీటీసీ గా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారని ఆ సానుభూతి కూడా ఈ ఎన్నికల్లో పని చేసిందని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డిగూడకు రూ.3.50 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్, 90 లక్షలతో సీసీ రోడ్డు, దళితవాడలో రోడ్లు వేయించానని ఇలా ఎన్ని అభివృద్ధి పనులు చేసినా రంగారెడ్డిగూడ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగిస్తానని తాను రెండేళ్ల కిందట గ్రామప్రజలకు మాట ఇచ్చానని, అయితే ఈ అంశం కోర్టులో ఉన్న కారణంగా ఆ వాగ్దానాన్ని ఇప్పటికీ నెరవేర్చలేకపోయానన్నారు.
ఇప్పటికైనా కలహాలు మానుకొని అందరూ మరోసారి కలిసి కూర్చుని మాట్లాడుకొని ఐక్యంగా పోటీ చేయాలని హితవు చెప్పారు. పార్టీలో అందరూ ఏకాభిప్రాయంతో పోటీ చేస్తే జరగబోయే రెండవ విడత, మూడవ విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.