calender_icon.png 15 December, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులు, తిరగబడితే మీరు తట్టుకోలేరు

14-12-2025 05:26:35 PM

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం

కాంగ్రెస్ గూండాల చేతిలో బలైన ఉప్పల మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటాం

మల్లయ్య కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం - భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం: కేటీఆర్ హామీ

దాడులను తట్టుకొని 50 శాతం స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆదివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందజేశారు. పార్టీ ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... కేవలం సర్పంచ్, పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అద్భుతాలు చేశామని, రుణమాఫీ, ఇళ్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే అయితే, ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

ఇచ్చిన 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని, కానీ వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు.మేము తిరగబడితే రాష్ట్రం ఆగమైతది"పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం.. ఏనాడూ మీలాగా ఆలోచించలేదు. మేము కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉండేదా?" అని కేటీఆర్ ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మాని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే, తాము కూడా తిరగబడక తప్పదని, అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి, పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి హింసాత్మక సంస్కృతి గతంలో లేదని, ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేశారు.

మల్లయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

మల్లయ్య చనిపోయిన వెంటనే రావాలనుకున్నా, ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతోనే ఆగానని కేటీఆర్ తెలిపారు. మల్లయ్య కుటుంబానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాగానే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదేనని కేటీఆర్ మాటిచ్చారు.

బీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు

కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, మొక్కవోని ధైర్యంతో పోరాడి పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ సైనికులకు కేటీఆర్ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. ప్రజలంతా కేసీఆర్ గారి పాలన కోసం, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, బూడిద బిక్షమయ్య, నేతలు భూపాల్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ రెడ్డి, గుజ్జ యుగంధర్ రావు, దయాకర్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.