calender_icon.png 15 December, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో రెండో విడత పోలింగ్

14-12-2025 04:54:15 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

కరీంనగర్ (విజయక్రాంతి): రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి  తెలిపారు. ఆదివారం తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని జోగయ్యపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, రామకృష్ణ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని శ్రీ రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ఆయా కేంద్రాల్లో అప్పటివరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు.  పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. క్యూలైన్లు పోలింగ్ కేంద్రాలలోనికి కాకుండా, కేంద్రం బయటే ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ గురించి బి.ఎల్.ఓలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తపరచాలని ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు.