14-12-2025 05:39:21 PM
- పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ఆర్మూర్ (విజయక్రాంతి): ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ఈ నెల 17వ తేదీన నిర్వహించనుండటంతో ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 16వ తేదీ మంగళవారం రోజున మాత్రం అభ్యర్థులు ప్రచార ఆర్భాటం లేకుండా నేరుగా ఓటర్ల ఇంటికి వెల్లి ఓటును అభ్యర్థించే వెసులుబాటు ఉండనుంది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో గల 12 మండలాలైన ఆర్మూర్, ఆలూర్, నందిపేట, డొంకేశ్వర్, బాల్కొండ, మెండోర, ముప్కాల్, వేల్పూర్, భీమ్‌గల్, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాల్లో గల 165 సర్పంచ్ స్థానాలకు, 1,620 వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలవడి నామినేషన్ల ప్రక్రియ ముగిసి పోలింగ్ కు చేరువైంది.
19 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు పోటీ నెల కొంది. అదేవిధంగా 485 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 1,135 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ నెలకొంది. ఆయా స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో సబ్ కలెక్టర్ అభిగ్నాన్ మాల్వియా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో చేస్తున్న ముమ్మర ప్రచారం చివరంకానికి చేరుకుంది. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నాయకులను పెద్దగా ఇన్‌వాల్వ్ చేయకుండా గ్రామల్లో కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను, బంధు గణాన్ని తమవైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతున్నారు. కొందరు అభ్యర్థులు ఖర్చుకు సైతం వెనకడుగు వేయకుండా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరీ ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, మాంసాన్ని ఇళ్లలోకి సరఫరా చేస్తున్నారు.
ఆర్మూర్ డివిజన్‌లో బీఎన్‌ఎస్ 163 సెక్షన్ అమలు
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడటంతో నేటి సాయంత్ర 5 గంటల నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) 163 సెక్షన్ అమలులో ఉంటుందని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడి ఉండొద్దని హెచ్చరించారు. ఈ ఆంక్షలు ఈ నెల 17వ తేదీన పోలింగ్, కౌంటింగ్ పూర్తయి విజేతలను ప్రకటించే వరకు ఉంటుందని వివరించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 17వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం, కల్లు దుకాణాలు బంద్ ఉంటాయని ఆర్మూర్ ఏసీపీ పేర్కొన్నారు.