02-07-2024 05:55:15 AM
కోల్‌కతా, జూలై 1: పశ్చిమ బెంగాల్‌లో మూకదాడుల పరంపర కొనసాగుతున్నది. ఒక్క వారంలోనే 12 చోట్ల ఇలాంటి దాడులు జరిగాయి. గత మూడు రోజుల్లో మూకదాడుల్లో ముగ్గురు మరణించారు. తాజాగా జర్‌గ్రామ్ జిల్లాలో చోరీకి యత్నించారనే అనుమానంతో ఓ వ్యక్తిపై కొందరు మూకదాడికి పాల్పడటంతో అతడు మృతి చెందాడు. ఇటీవల ఉత్తర దినాజ్‌పూర్‌లోని ఓ జంటపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన మూకదాడి ఇప్పడు రాజకీయ చర్చకు దారితీస్తోంది. జూన్ 22వ తేదీన జర్‌గ్రామ్ జిల్లాలోని జంబోనీ ప్రాంతంలో సౌరభ్ (23), అతడి స్నేహితుడు స్కూటీపై వెళ్తుండగా.. నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద కాసేపు ఆగారు.
అయితే భవనం వద్ద పార్క్‌చేసి ఉంచిన ఓ ఎర్త్ మూవర్ వాహనం చోరీకి యత్నించారనే అనుమానంతో వారిపై కాంట్రాక్టర్‌కు సబంధించిన సిబ్బంది కొందరు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని బాధితులను కాపాడంటంతో పాటు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9 రోజుల అనంతరం సౌరభ్ మృతిచెందాడు. అతడి స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.