calender_icon.png 27 August, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమల్లోకి కొత్త చట్టాలు

02-07-2024 01:02:38 AM

  • మధ్యప్రదేశ్‌లో మొదటి కేసు నమోదు
  • హైదరాబాద్‌లోనూ కేసు నమోదు

న్యూఢిల్లీ జూలై 1/చార్మినార్: నూతన క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అమల్లోకి వచ్చిన 10 నిమిషాల్లోనే భారతీయ న్యాయ సంహిత కింద మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మొదటి కేసు నమోదయింది. ఇన్ని రోజులు అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, అదే విధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియమ్ అందుబాటులోకి వచ్చాయి. 

ఢిల్లీలోని ఓ వీధి వ్యాపారిపై తొలి కేసు నమోదైందని.. మీడియా రిపోర్టులు వెల్ల డించినా కానీ అది నిజం కాదని మధ్యప్రదేశ్‌లో తొలి కేసు నమోదైనట్లు హోం మంత్రి షా స్పష్టం చేశారు. రూ.1.80 కోట్ల మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించి తొలి కేసు నమోదయిం దని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పాత బస్తీలో కూడా కొత్త చట్టాల కింద రాష్ట్రంలో తొలికేసు నమోదైంది. 

ఢిల్లీలో తొలి కేసంటూ హడావుడి.. 

కొత్త క్రిమినల్ చట్టాల కింద ఢిల్లీలోని ఓ వీధి వ్యాపారిపై తొలి కేసు నమోదైందని సోమవారం ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని మొదటి కేసు గ్వాలియర్‌లో నమోదైనట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. సెక్షన్ 285 కింద తొలికేసు నమోదయింది. ఓ వీధి వ్యాపారి రోడ్డు మీద వ్యాపారం చేస్తూ పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాడని... అక్కడి నుంచి వ్యాపారం వేరే చోటికి తరలించాలని అతడికి ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకపోవడంతో పోలీసులు అతడి మీద కేసు నమోదు చేశారు.

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో ఇది జరిగింది. అతడి మీద ఫఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు వీడియో కూడా తీశారు. ఆ వ్యాపారి స్వస్థలం బీహార్‌లోని పాట్నాగా గుర్తించారు. మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న క్రిమినల్ చట్టాలను ఇవి భర్తీ చేశాయి. 

420 అవుట్

సెక్షన్ 420.. చట్టాల గురించి తెలియని వారికి కూడా ఈ సెక్షన్ తెలిసే ఉంటుంది. అంతలా ఈ సెక్షన్ పాపులర్ అయింది. సినిమాల్లో, పాటల్లో, నిజజీవితంలో ఇలా ఒక్క చోటేమిటి చాలా వరకు సెక్షన్ 420 అనేది అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహితలో ఈ సెక్షన్ కనుమరుగైంది. ఈ సెక్షన్ స్థానంలో అందులో సెక్షన్ 318ని చేర్చారు. దాదాపు 164 సంవత్సరాల పాటు అమల్లో ఉన్న సెక్షన్ 420 కనుమరుగయింది. 

కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చిన రోజే ఆ చట్టాల కింద తెలంగాణలోనూ ఒక కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని సౌత్‌జోన్ పరిధిలోని గుల్జార్ హౌజ్ వద్ద ఓ ద్విచక్రవాహనదారుడికి నంబర్ ప్లేట్ లేకపోవటంతో కొత్త చట్టం ప్రకారం తొలికేసు నమోదు చేసినట్టు చార్‌మినార్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సోహైల్ అన్సారీ అనే వ్యక్తిపై ఈ కేసు నమోదుచేసినట్టు వెల్లడించారు. ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.