14-06-2024 12:00:00 AM
జనక మోహన రావు దుంగ :
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకపాత్ర పోషి స్తుంది. వ్యవసాయానికి వ్యయ సాయం అవసరం. ఇప్పటికీ వ్యవసాయం చెయ్యడమంటే కత్తిమీద సాము లాంటిదే. విత్తు నుండి కోత వరకూ రోజూ రైతుకు ఒత్తిడే. ప్రతీ రంగంలో మార్పులు వస్తున్నాయి. దీనికి వ్యవసాయ రంగం మినహాయింపు కాదు. సాంకేతికతను జోడించి ఖర్చులను కనిష్టం చేసే మార్గాలను ప్రవేశపెట్టాలి. నాణ్యమైన పంటలను అత్యంత సమర్థవంతంగా పండించాలంటే వాటికి సరైన సమయంలో సరైన మొత్తంలో నీరు ఉండాలి. తక్కువ నీరు పంటలు వాడి పోవడానికి దారి తీస్తుంది. మొక్కలకు పోషకాలు సరిగా అందవు. దేశం మొత్తం భూభాగంలో వ్యవసాయ అవసరాల కోసం దాదాపు 60 శాతం భూభాగం మాత్రమే వినియోగమవుతోంది. నీతి ఆయోగ్ డేటా ప్రకారం గత సంవత్సరంలో దేశంలోని 14.1 కోట్ల హెక్టార్ల స్థూల విత్తన విస్తీర్ణంలో 52 శాతం అంటే దాదాపు 7.3 కోట్ల హెక్టార్లు నీటి పారుదల సౌకర్యాన్ని కలిగి ఉంది.
మొత్తం నీటి పారుదల ప్రాంతంలో 40 శాతం కాలువల మీద, మిగిలింది భూగర్భ జలాల మీద ఆధారపడి ఉంది. రుతు పవనాలలో ఏ మాత్రం తేడా వచ్చి సరైన సమయంలో వర్షం పడకపోతే కాలువల మీద ఆధారపడిన ప్రాంతంలో కూడా పంటలు పండవు. అప్పుడు ఇక్కడ కూడా భూగర్భజలాలే శరణ్యం. ఇక, ఇతర ప్రాం తాల్లో కేవలం భూగర్భ జలాలే ఆధా రం. ఈ జలాల్ని బోరుబావి నుండి మోటా ర్ల ద్వారా బయటకు తీసుకురావడానికి విద్యు త్ అవసరం. అన్ని ప్రాంతాలకు అన్ని రోజులలో నాణ్యమైన విద్యుత్ అందించడం అన్నది ప్రభుత్వాలకు కష్టంతో కూడుకున్న పని. సాంకేతికతను జోడించి ఖర్చులను తక్కువ చేసే మార్గాలను ప్రవేశపెట్టాలి.
దీనికి సౌర విద్యుత్ నీటి పారుదల వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో సౌరశక్తి ప్రధానం. ఒక గంటలో భూమిని తాకిన సౌరశక్తి ప్రపంచం మొత్తం ఒక సంవత్సరంలో వినియోగించే శక్తి కంటే ఎక్కువ! నీటి పారుదల వ్యవస్థకు సౌరశక్తిని వినియోగించడాన్నే ‘సౌరవిద్యుత్ నీటిపారుదల వ్యవస్థ’గా పిలుస్తున్నారు. ఇందులో సౌర ఫలకాలు, పంపు, కంట్రోలర్లు, సెన్సార్లు, నీటి పంపిణీ నెట్‌వర్క్ సహా అనేక కీలక భాగాలు ఉంటాయి. నీటి పారుదలకు కీలకమైన మోటార్లు సౌరవిద్యుత్ ద్వారా పని చేస్తాయి. సౌర ఫలకాలు సూర్యరశ్మిని వి ద్యుత్తుగా మారుస్తాయి. కంట్రోలరు, సెన్సా ర్లు నేల తేమ స్థాయిలు, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలను పర్యవేక్షిస్తాయి. నీటి ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా సమర్థవంతమైన నీటి వినియోగాన్ని నిర్ధారిస్తాయి. పంటలకు అత్యధిక నీరు అవసర మయ్యే ఎండా కాలంలో సౌరశక్తి సమృద్ధిగా ఉంటుంది. పగటిపూట ఎండలు బ లంగా ఉన్నప్పుడు పొలాలకు ఎత్తయిన ట్యాంకుల్లోకి నీటిని పంపింగ్ చేయడం ద్వారా ఈ ఉచిత శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుని రైతులు భారీ లాభాలను పొందవచ్చు.
ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ‘ఎస్‌ఎం సెహగల్ ఫౌండేషన్’ సౌరశక్తితో నడిచే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను ప్రోత్సహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసా యంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నా యి. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థలు నీటిని పంప్ చేయడానికి సౌరశక్తిని వినియోగించుకుంటాయి. సంప్రదాయక డీజిల్ పంపుసెట్లను భర్తీ చేస్తాయి. అంతేకాకుండా, రైతులకు ఖర్చులు తగ్గుతాయి.
ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ
దీనికి సాంప్రదాయ విద్యుత్ అవసరం లేని కారణాన విద్యుత్ కోతలతో పని ఉండదు. విద్యుత్ బిల్లులు కట్టనవసరం లేదు. పెట్రోల్ లేదా డీజిల్ వంటి ఇంధనం అవసరం ఉండదు కాబట్టి, పర్యావరణ హితమైనది. విద్యుత్ అందుబాటులో లేని కొండ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాల్లో నీటి పారుదల సాధ్యం చేస్తుంది. వరి పొలాలు, పండ్ల తోటలు, కూరగాయల తోటలకు అనుకూలం. సౌర నీటి పంపింగ్ వ్యవస్థలు మారుమూల ప్రాంతాలలో కూడా నీటిపారుదలను సాధ్యం చేస్తాయి. మన్నిక ఎక్కువ. సౌర ఫలకాల నాణ్యత సాధారణంగా 25 నుండి 30 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. నిర్వహణ ఖర్చులు తక్కువ. చదునైన భూభాగాల నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు అనువైంది.
లోతైన నీటి వనరులు ఉన్న ప్రాంతాలకూ అనుకూలం. స్ప్రింక్లర్ సిస్టంలు నీటి పంపులకు శక్తిని ఇవ్వడానికి, సౌరశక్తిని ఉపయోగించుకొని బిందువుల రూపంలో నీటిని పొలంలో పంపిణీ చేసే పెద్ద వ్యవసాయ ప్రాంతాలకు అనుకూలం. బిందుసేద్యం ద్వారా నీటిని నేరుగా మొక్కలకు సరఫరా చేస్తాయి. బాష్పీభవనాన్ని (నీటి ఆవిరి) తగ్గించడం ద్వారా నీటిని ఆదా చేస్తాయి. కొండ ప్రాంతాలు, పరిమిత నీటి లభ్యత ఉన్న ప్రాంతాల పంటలకు ఉపయోగకరం. శుష్క, పాక్షిక శుష్క ప్రాంతాలలో ముఖ్యమైన వనరు అయిన నీటిని సంరక్షించడంలో సహాయ పడుతుంది. నీటి వృధాను తగ్గిస్తుంది. భూగర్భ జలాలను కాపాడవచ్చు. రైతులు దూరం నుండి నీటి పారుదల వ్యవస్థలను పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయి. సమర్థవంతమైన, స్థిరమైన నీటి నిర్వహణను అనుమతిస్తుంది.
భూగర్భ జలాలపైనే..
భారతదేశంలో దాదాపు 17.5 లక్షల చదరపు కిలోమీటర్ల సాగు భూమి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. దేశంలోని మెజారిటీ భూమి 3 కోట్ల భూగర్భ జలపంపులను ఉపయోగించి నీటిపారుదలను కలిగి ఉంది. ఇందులో 2 కోట్ల పంపులు గ్రిడ్‌కు అనుసంధానమై ఉన్నాయి. 1 కోటి పంపులు డీజిల్ తో నడుస్తుండగా, 39 లక్షల పంపులు మాత్రమే సౌరశక్తిని ఉపయోగించి నడుస్తున్నాయి. గత అయిదు సంవత్సరాల్లో చత్తీస్‌గ ఢ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలు మాత్రమే నీటి పారుదలకు ఈ సౌరశక్తితో నడిచే పంపులను వినియోగించాయి. సౌరశక్తితో నడిచే నీటి పారుదల విధానాన్ని అవలంబించడం వల్ల వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీపై రూ.1 లక్ష కోట్ల భారం తగ్గడమే కాకుండా డీజిల్ వినియోగాన్ని సంవత్సరానికి 138 కోట్ల లీటర్లు తగ్గించడం ద్వారా చమురు బిల్ల్లును గణనీయంగా తగ్గించవచ్చు.
మరోవైపు పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలను సైతం తగ్గించవచ్చు. సౌర విద్యుత్ వ్యవసాయం ద్వారా కర్బన ఉద్గారాలను 3.2 కోట్ల టన్నుల మేర తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సౌరశక్తితో నడిచే పంపులను ఉపయోగించడం వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రైతులకు నమ్మకమైన ఇంధన వనరులను అందించడంతోపాటు దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇది ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది. హర్యానా, చత్తీస్‌గఢ్‌లలో ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ -ఇండియా (ఐసీఏ), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ (ఐఐఈసీ) నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం సోలార్ పంపులు రైతుల రోజు వారీ పనిభారాన్ని తగిస్తాయి. వ్యవసాయంతో ఉత్పాదక తను మెరుగు పరుస్తాయని, సగటు ఆదాయాన్ని పెంచుతాయనీ వెల్లడయింది.
సవాళ్లు, పరిష్కారం
సౌర ఫలకాలు, పరికరాలతోసహా సౌర విద్యుత్ నీటి పారుదల వ్యవస్థల పరికరాల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మేఘావృతమైన రోజులు లేదా రాత్రి సమయంలో ఈ పంపుల పని తీరు తగ్గుతుంది. సౌర ఫలకాల ఏర్పాటు కోసం అధిక స్థలం అవసరం కారణంగా సాగుభూమి కొంత వృధా అవుతుంది. కొంతమంది రైతులకు సోలార్ ఇరిగేషన్ ప్రయోజనాలు లేదా సాంకేతికతను ఎలా పొందాలో తెలియక పోవచ్చు. నిర్వహించడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం అందరికీ ఉండక పోవచ్చు. ఇలాంటి సవాళ్లను అధిగమించడానికి రైతులకు ఆర్థిక సహాయం అందించాలి. రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. అమ్మకాల తర్వాత సేవలను అందించడానికి ప్రభుత్వం, ప్రైవేట్ రంగం సహకరించాలి. అప్పుడు సౌర విద్యుత్ నీటి పారుదల వ్యవస్థలు భారతదేశంలో స్థిరమైన వ్యవసాయానికి మంచి పరిష్కారాన్ని అందిస్తాయి.
వ్యాసకర్త సెల్: 8247045230