calender_icon.png 25 August, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదాతల చేతుల్లో ప్రాణదానం

14-06-2024 12:00:00 AM

అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తదానం విలువను తెలపాలనే ఉద్దేశంతో ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని’ ప్రతీ సంవత్సరం జూన్ 14న అంతర్జాతీయ స్థాయిలో  నిర్వహిస్తున్నారు. ఈ రోజు రక్తదానంపై అవగాహన సదస్సులు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారికి సన్మానాలు కూడా చేస్తారు. 1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ బహుమతి విజేత కార్ల్ లాండ్‌స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన ‘జయంతి’ అయిన జూన్ 14 ను ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’గా జరుపుతున్నారు. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో విశ్వవ్యాప్తంగా నిర్వహించారు.

ప్రమాదాల సమయంలో లేదా మరే ఇతర కారణంగా అయినా బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రక్తాన్ని తీసుకొనే వ్యక్తి గ్రహీత అయితే, ఇచ్చే వ్యక్తి దాత. ప్రాణానికి ఆధారం రక్తం. దీనిని కృత్రిమంగా తయారు చేయడానికి లేదా మరో మార్గంలో ఉత్పత్తి చేయడానికి వీలు కాదు. ప్రమాదాలు, వ్యాధులు లేక శస్త్రచికిత్స కారణంగా రక్తం కోల్పోయిన వారికి దాని అవసరం ఏర్పడుతుంది. దీనిని దాతల ద్వారా స్వచ్చందం మాత్రమే స్వీకరించ గలుగుతాం. రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. రక్తం ఎప్పుడు అవసరానికి సరిపడక కొరతగానే ఉంటుంది. దీని నివారణకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అపోహలను తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 11.8 కోట్ల రక్తదానాలు జరుగుతున్నాయని, ఇవి ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో నమోదు అవుతున్నాయని, ప్రతి 1000 మందిలో 33 మంది రక్తదాతలుగా ఉండగా, పేద దేశాల్లో1000 మందికి నలుగురు మాత్రమే రక్తదానం చేస్తున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. 18 సంవత్సరాల నుండి 55 ఏళ్ల లోపు ఉండి శరీర బరువు 50 కిలోలపైన ఉండి, రక్తంలో హిమోగ్లోబిన్ 12.5 గ్రాములకంటే ఎక్కువున్న ఆరోగ్యవంతులైన వారు రక్తదానం చేయవచ్చు. ఈ కార్యక్రమం దాదాపు 15 నిముషాల్లో ముగుస్తుంది. ఇంత తక్కువ సమయంలో రక్తదానం చేసి ఇతరుల ప్రాణం కాపాడే అవకాశం ఉంది.

30 శాతం మంది మహిళలు!

భారతదేశంలో 2017-28 అంచనా ప్రకారం దాదాపు 130 లక్షల యూనిట్ల రక్తం అవసరం పడుతుందని, కానీ వివిధ సంస్థలు, వ్యక్తిగతంగా కలుపుకుంటే దాదాపు 115 లక్షల మిలియన్ యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నందున రక్తదాతల అవసరం ఎంతైనా ఉందని ఈ నివేదికల ద్వారా తేలిం ది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలలో 13,000 రక్త నిధి కేంద్రాలద్వారా 10 కోట్ల యూనిట్లకన్న ఎక్కువనే రక్తాన్ని స్వీకరిస్తున్నారు. రక్తదాతలలో దాదాపు 30 శాతం మంది మహిళలు ఉండడం గర్వకారణమే. రక్తం దానం చేయడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ అవగాహన లేక చాలామంది రక్తదానం చేయడం లేదు. కొనలేనిది తయారు చేయలేనిది రక్తం. ఇది ఎంతో మంచి పని. విద్యార్థి దశలోనే చిన్నారులకు చెప్పడం, యువతకు ఆ మేరకు అవగాహన కల్పించడం ద్వారా రక్తదాతలను పెంచవచ్చు.

ఆరోగ్యవంతుని శరీరంలో 5-6 లీటర్ల రక్తం ఉంటుంది. 300-500 మిల్లిలీటర్ల రక్తాన్ని మాత్రమే ఒకసారి దానం చేస్తారు. దీనివల్ల శరీరంలో రక్తం కొరత ఏ మాత్రం ఏర్పడదు. పైగా ఈ మోతాదు రక్తం  శరీరంలో 48 గంటల్లోనే తిరిగి ఉత్పత్తి అవుతుంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రతీ 3 నెలల తర్వాత ఒకసారి రక్త దానం చేయవచ్చు. దాతలు ఇచ్చిన రక్తం ప్రత్యేక పద్ధతులలో 35 రోజుల వరకు నిలువ ఉంచే అవకాశం ఉంటుంది. రక్తదానం చేస్తే బలహీనపడి పోతారని, నీరసించి పోతారని, శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు గతం వలె పని చేసుకోలేరని, విపరీతమైన నొప్పి ఉంటుందని ఇత్యాది అపోహలు ఉన్నాయి. కానీ, ఇవన్నీ నిజం కాదు. రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత గాని, అనారోగ్యం గాని ఉండక ఎప్పటిలా ఆరోగ్యంగా ఉండి, యథావిధిగా అన్ని రకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు. రక్తాన్ని గురించిన అధ్యయనాన్ని ‘హెమటాలజి’ అంటారు. రక్తం ఒక ద్రవరూప కణజాలం. సగటు వ్యక్తిలో ఐదున్నర లీటర్ల రక్తం, రెండున్నర లక్షల కోట్ల ఎర్రరక్త కణాలు ఉంటాయి. ఆరోగ్యవంతులైన వారు స్వచ్చందంగా రక్తదానం చేసి, మరొకరికి ప్రాణదాతగా మారవచ్చు. ఈ అద్భుత అవకాశాన్ని అందరం వినియోగించుకోవాలి.

- గడప రఘుపతి రావు 

సెల్: 9963499282