29-08-2025 03:29:15 AM
అవాస్తవ ఆరోపణలతో ప్రత్యర్థులను పడగొట్టామని భావించడం రాజకీయ నాయకులకు నిత్యకృత్యమైంది. అలాంటి ఆరోపణలు తాత్కాలిక ప్రయోజనం కలిగిస్తాయేమో గాని సత్యానికి నిలవవు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాంటి ఆరోపణే ఇటీవల కేరళలో చేశారు. ఆరోపణ చేసింది ఎవరి మీద? సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి పైన.
ఉపరాష్ట్రపతి పదవికి జరుగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నా యకత్వంలోని ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని తమ అభ్యర్థిగా నిలిపింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామిక విలువలను కాపాడటంలో ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు ఉపరాష్ట్రపతి అయితే బాగుం టుందనేది పార్లమెంట్ సభ్యులు నిర్ణయించుకొని ఓటేస్తారు. ఇక్కడే అమి త్ షా ఒక అడుగు ముందుకేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గతంలో సల్వాజుడుంను రద్దు చేస్తూ తీర్పునిచ్చారని, దానివల్ల ఐదేళ్ల క్రితమే అంతం కావాల్సిన నక్సలిజం ఇప్పటివరకు కొన సాగిందనేది హోంమంత్రి బాధ. నక్సలిజం గురించి, దానిని అంతం చేయడంలో అనుసరించే పద్దతుల గురించి అమిత్ షాకు ప్రత్యేకమైన అభిప్రా యాలు ఉంటే ఉండవచ్చు. అయితే సల్వాజుడుంపై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పు అంటూ, రిటైరైన ఒక న్యాయమూర్తి పేరు తీసుకొని ఆరోపణ చేయడం వివాదంగా మారింది.
సుప్రీంకోర్టు తీర్పును విశ్లేషించవ చ్చు, విమర్శించవచ్చు గాని, న్యాయమూర్తులను వ్యక్తిగతంగా నిందించ డం చెల్లనేరదు. సామాన్యులు ఆ పని చేస్తే నేరమవుతుంది. ఇది హోంమంత్రికి తెలియదని అనుకోలేము. ఏన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ఆరోపణ చేస్తున్నామనే అనుకొన్నారేమో, ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అనే విషయం మరిచారు. సల్వాజుడుంపై ఇచ్చిన తీర్పు తన ఒక్కరిది కాద ని, అది జస్టిస్ ఎస్ ఎస్ నిజ్జార్‌తో కలిసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుగా పరిగణించాలని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి హుందాగా వివరణ ఇచ్చారు.
కేంద్ర హోంమంత్రి తన మాటల ద్వారా జ్యుడీషియరీలోనూ విభజన తెచ్చే ప్ర యత్నం చేస్తున్నారని న్యాయ కోవిదులు ఆక్షేపిస్తున్నారు. పేరు పెట్టి ఒక జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం తగదని అభ్యంతరం తెలుపుతూ 18 మంది సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల్లో ప్రచారం.. సిద్ధాంతపరంగా, గౌరవంగా ఉండా లని, ఇలా న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలిగించేలా ఉండకూడదని వారు లేఖలో స్పష్టం చేశారు.
నక్సలిజం సిద్ధాంతానికి ప్రేరేపితుడైన వ్యక్తిగానే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని అమిత్ షా చెప్పడంలోనూ అర్థం లేదని మాజీ జడ్జీలు నిర్వంధంగా చెప్పారు. నక్సలిజం, దాని సిద్ధాంతానికి మద్దతు తెలుపుతున్నట్లు ఎక్కడా ఆ తీర్పులో పేర్కొనలేదని కూడా స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్ర ప్రభు త్వం అండదండలతోనే నక్సల్స్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించేందుకు గిరిజన యువకులతో సాయుధ దళాన్ని సల్వాజుడుం పేరుతో ఏ ర్పాటు చేశారని, ఇది చట్ట విరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమని 2011లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా, సల్వాజుడుం క్రిమినల్ కార్యకలాపాలు సాగించిందని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ దళాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకు డు మహేంద్ర కర్మా 2013లో నక్సల్స్ దాడిలో మరణించారు.