calender_icon.png 28 July, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గోండు మల్లె’ల్లో తళుకుల తార!

28-07-2025 12:46:42 AM

చెట్టూ.. పుట్టా.. గుట్టా.. ఆ అడవి తల్లి పొత్తిళ్లలో పురుడు పోసుకున్న మనుషుల్లో అమాయకత్వం ఇట్టే తెలుస్తుంది. ఆ ప్రకృతి ఒడిలో ఆడిపాడుతూ, కల్మషం లేని బంధాలూ బంధుత్వాల మనసుల్లోని స్వచ్ఛత ఇట్టే గుర్తుపట్టేయవచ్చు. అన్ని పొద్దుల్లోనూ విరబూసినట్టుండే ఆ ‘కొండమల్లెల’ గాలి ఎక్కడ వీచినా సరే.. అది పల్లె అయినా, పట్నమైనా.. అక్కడ ప్రేమాపరిమళాలు వెదజల్లుతాయంతే! దాదాపు ఇదే సన్నివేశం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం నాడు అక్కడున్న కొన్ని మనసులకు ఎదురైంది. 

ఆ అనుభూతి అక్కడున్న వాళ్లలో ఎందరికి కలిగిందో తెలియదు కానీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాత్రం ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేసినట్టే అనిపించింది. అందుకే ఆ ఆనందాన్ని తన కొత్త సినిమా కార్యక్రమానికి ప్రత్యేక అతిథులతో కలిసి పంచుకుంటూ ‘తెగ’ సంబుర పడిపోయింది. 

ఆ ‘గోండు మల్లెలు’ ఒకవైపు, ఈ ‘కొడవ తార’ మరోవైపు.. అడవిలోని నెమలులోలె పోటీపడి ఆడిపాడిన ఆ క్షణాన ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు నెమలిలా ఒళ్లన్నీ కళ్లున్నా చాలకపోయేదేమో!! 

విషయం ఏంటంటే.. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోంది. అది ‘మైసా’ అనే టైటిల్‌తో రాబోతోంది. గోండ్ తెగల బ్యాక్‌డ్రాప్‌లో బలమైన భావోద్వేగాలతో సమ్మిళితమైన ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని అన్‌ఫార్ములా ఫిల్మ్స్.. భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. 

ఆదివారం ఈ సినిమా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కూడా సినీప్రముఖులు, కోర్ టీమ్ హాజరయ్యారు. ప్రతిసారి సినీజనాల సందడే కనిపిస్తుంది. ఈసారి రొటీన్‌కు భిన్నంగా గోండ్ తెగవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ గోండు మహిళలు తమ సంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. అది చూసి మన నేషనల్ క్రష్‌కు కాలాగలేదు. ఇంకేముంది.. ఆ గోండు మగువల మధ్య తానూ చేరిపోయిందీ తళుకుల తార.