16-08-2025 12:00:00 AM
ఆదిలాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తూ... రాష్ర్టం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్‌లోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులతో కలిసి మువ్వన్నెల జెండాను ఎగరవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన వాహనంలో కలెక్టర్, ఎస్పీలతో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించా రు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన వివిధ విద్యాసంస్థల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ వివిధ శాఖలు శకటాలను ప్రదర్శించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉత్తమ ఉద్యోగులకు ప్రశంశా పత్రాలు అందజేసి అభినందించారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయం గా పనిచేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజా రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.