02-01-2026 12:25:25 AM
ధ్రువీకరించిన అటవీ అధికారులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
మహబూబాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ కడపలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. బుధవారం ఓటాయి, రాంపూర్ కర్ణ గండి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు, అటవీ ప్రాంతంలో పర్యటించి పులి అడుగులను గుర్తించారు. ములుగు జిల్లా జాకారం అటవీ ప్రాంతం నుంచి పులి ఎటు వెళ్లిందనే దిశగా అధికారులు పరిశీలిస్తుండగా కొత్తగూడ మండలం రెన్యా తండా సమీపం కాలిబాటలో బుధవారం పులి అడుగులను గుర్తించారు.
పులి లింగాల వైపు వెళ్లిందా కర్ణ గడ్డి వైపు వెళ్లిందా అనేది అటు విశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్తగూడా అడవుల్లో పులి కదలికలను నిర్ధారించిన అటవీశాఖ అధికారులు అటవీ సమీప గ్రామస్తులను అప్రమత్తం చేశారు. రాత్రి వేళలో బయటకు రావద్దని, అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లినవారు, పశువుల కాపర్లు సాయంత్రం లోపు ఇండ్లల్లోకి చేరాలని సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్ ఆదేశాలతో అన్ని బీట్లలో అటవీ అధికారులు సిబ్బంది పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తమయ్యారు.
ఇలా ఉండగా గత ఏడాది సరిగ్గా జనవరి 1న పూనుగొండ్ల అటవీ ప్రాంతంలో పులి సంచరించిన దృశ్యాలు అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కింది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ కొత్తగూడ అడవుల్లో పులి కదలికలు కనిపించడం విశేషంగా చెబుతున్నారు. అయితే పులులు ఈ సమయంలో మేటింగ్ కోసం వస్తాయని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పులి కనిపిస్తే అటవీశాఖ అధికారులకు తెలియపరచాలని కొత్తగూడా రేంజ్ అటవీ అధికారి వజహత్ తెలిపారు.