19-05-2025 01:20:35 AM
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సాయిజన్‌శేఖర్ ఆధ్వర్యంలో ఉప్పల్ తొలి ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డికి నాచారంలోని ఏఎన్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం పెద్ద ఎత్తున సంతాప సభ ఏర్పాటు చేశారు. రాజకీయంగా తనకు ఓనమాలు నేర్పింది బండారి రాజిరెడ్డి అంటూ సాయి జెన్‌శేఖర్ కన్నీటి పర్యంతమయ్యారు. నిజాయతీకి నిలువుటద్దం బండారి రాజిరెడ్డి అంటూ రాజిరెడ్డిని గుర్తు చేసుకున్నారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అన్న బండారి రాజారెడ్డి చూపిన బాటలోనే నడుస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిజాయితీ గల పాలనా అందిస్తానని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఏ నాయకునికి ఇంత పెద్ద ఎత్తున సంతాప సభలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని, గత వారం రోజులుగా ప్రతిరోజు రెండు మూడు కాలనీలలో సంతాప సభలు ఏర్పాటు చేయడం రాజిరెడ్డికే దక్కిందన్నారు.