calender_icon.png 28 August, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకా వరకట్న వేధింపులా?

04-08-2024 12:00:00 AM

భారతదేశంలో వివాహవ్యవస్థలో వివిధరకాల చట్టాలు వచ్చాయి. భిన్నత్వంలో ఏకత్వంలా ఉన్న మన దేశంలో ఒక్కో మతం ఒక్కో విధంగా ప్రజల ఆచార సంప్రదాయాలు, పద్ధతులనుబట్టి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. అదే విధంగా వరకట్నం కూడా ఒక్కో రూపంలో ఉంటున్నది. దేశంలోని సామాజిక సమస్యలలో అతిపెద్ద సమస్యగా ఇది నేటికీ చాపకింద నీరులా కొనసాగుతున్నది. దీనికి అడ్డుకట్ట వేయలేక పోతున్నాం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన అతికొద్ది కాలానికే ‘వరకట్న నిషేధ చట్టం’ చేశారు. ఇంకా ఈ సమస్య పూర్తిగా రూపుమాపలేక పోయామంటే లోపాలేమిటో ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలి. ఆడపిల్ల తల్లితండ్రులకు ఇదొక శాపంగా మారింది. ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాలలోనూ ఈ దురాచారం బాగా పెరిగింది.

చదువుకున్న అబ్బాయిలకు స్థోమత ఉండి, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ పోషించే శక్తి ఉన్నాకూడా కట్నం తీసుకోకుండా వుండటం లేదు. వరకట్నం కేసులు అంతకంతకూ దేశంలో పెరుగుతున్నాయి. అత్తిళ్ల వేధింపులవల్ల ఎంతోమంది సతమతమవు తున్నారు. తల్లితండ్రులకు చెప్పలేక, ఇబ్బంది పడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఆడబిడ్డలు ఎందరో. దేశంలో అత్యధికంగా వరకట్న మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉంది. తర్వాత బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, హర్యానా, జార్ఖండ్, తెలంగాణలు ఉన్నాయి. కాబట్టి, ప్రభుత్వాలు ఇకనైనా పకడ్బందీగా వరకట్న నిషేధ చర్యలు తీసుకోవాలి. నేరస్థులకు కఠిన శిక్షలు పడాలి. 

 కిరణ్ ఫిషర్