calender_icon.png 9 May, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబార్షన్లకు కేరాఫ్ హాలియా!

08-05-2025 12:27:55 AM

  1. రోగుల జేబు గుల్ల చేస్తున్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలు
  2. విచ్చలవిడిగా హెవిడోస్ ఇంజెక్షన్లు
  3. పట్టించుకోని యంత్రాంగం

నాగార్జునసాగర్, మే ౭ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆర్‌ఎంపీ క్లినిక్లు, అనుమతి లేని రక్త పరీక్షా కేంద్రాలు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. విచ్చలవిడి వైద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

పరిధి దాటి వైద్యం చేస్తున్న కొందరు ఆర్‌ఎంపీలు పేదల ప్రాణాలు తీస్తున్నారు. ఆర్‌ఎంపీ బోర్డుతో కొందరు ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స చేయాల్సిన వారు రోజుల తరబడి వచ్చీరాని వైద్యం చేస్తున్నారు. రోగి ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా వ్యవహరిస్తున్నారు.

హాలియా పట్టణ కేంద్రంలో

లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఈ పరీక్షలు నిర్వహించినట్టు తేలితే కఠినశిక్షలు అనుభవించక తప్పదు. అందుకే వైద్యు లు ఈ పరీక్షలు చేయడానికి నిరాకరిస్తుంటారు. పుట్టబోయే బిడ్డ ఆడా..మగా అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించడం కూడా నేరం. ఈ విషయంలో డాక్టర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. ఎవరు ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా పుట్టబోయే బిడ్డ&ఆడా మగా అన్నది వెల్లడించరు.

కానీ కొందరు అక్రమార్కులైన డాక్టర్లు మాత్రం దీన్నో ఆదాయవనరుగా చూస్తున్నారు. పుట్టబోయేది అమ్మాయి అని తేలితే కమిషన్లకు కక్కుర్తి పడి భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది వైద్యరంగంలో మాఫి యాగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించారు.  ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు కన్నీళ్లు హడావుడి చేస్తున్నారు.  తర్వాత చూసి చూడనట్లు వ్యవహిస్తున్నారు. 

దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాలియా పట్టణ కేంద్రం లింగ నిర్ధారణకు, అబార్షన్లకు కేరాట్‌గా మారింది. ఆస్పత్రులు భ్రూణ హత్యలకు ప్రసిద్ధి చెందాయి.  ఇటీవల తిరుమలగిరి సాగర్ ప్రాంతంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి.  కొంతమంది ఆర్‌ఎంపీలు మీడియేటర్లుగా ఉంటూ ఈ దందా సాగిస్తున్నారు.

అబార్షన్ చేయటానికి ఒక్కొక్కరి నుంచి రూ.25వేలు వసూలు..లింగ నిర్ధారణ పరీక్షలు చేసి..అబార్షన్ సాగర్ నియోజకవర్గ హాలియా పట్టణ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు వైద్యులుగా కన్నా కమిషన్ ఏజెంట్లగానే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇక్కడ జరిగే మరో దారుణం.. కొన్నిసార్లు స్కానింగ్లో అమ్మాయన్న విష యం స్పష్టంగా తేలకపోయినా&అబార్షన్ డబ్బుల కోసం గర్భస్థ శిశువు అమ్మాయే అని చెబుతున్నారు కొందరు వైద్యులు.

అబార్షన్ పూర్తయ్యాక అసలు విషయం తెలిసినా తల్లిదండ్రులు ఏం చేయలేక తేలుకు ట్టిన దొంగల్లా ఉండిపోతున్నారు. ఆడపిల్లా? మగపిల్లాడా అని చెప్పటానికి కోడ్ లాంగ్వేజ్..అసలు లింగనిర్ధారణ చేయడం, ఆడపిల్ల అని తేలితే అబార్షన్ చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా.. ఆర్‌ఎంపీల మధ్య వర్తిత్వం లేకుండా వచ్చే గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపినప్పటికీ పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అన్నది చెప్పరు.

ఆర్‌ఎంపీ ద్వారా వస్తే మాత్రం&పుట్టబోయేది ఎవరో తెలుసుకోవడం చిటికెలో పని. అయితే ఇది చట్టరీత్యా నేరం కాబట్టి&ఎవరూ నేరుగా మాట్లాడుకోరు. ఎలాంటి వైద్య పరమైన రసీదులూ ఉండవు. పుట్టబోయేది ఎవరో తెలుసుకునేందుకు డాక్టర్లకు, రోగులకు మధ్య ఓ కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. చిటికెనవేలు చూపిస్తే అబ్బాయని, రెండు వేళ్లు చూపిస్తే పాప అన్నది అక్కడికి వచ్చిన అందరికీ అర్ధమవుతుంది.

ఆర్‌ఎంపీలు అనేకమంది ప్రయివేట్ నర్సింగ్ హోమ్లకు కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు,ఆడపిల్లంటే చిన్నచూపు, ప్రజల్లో అవగాహనారాహిత్యం వంటివి ఆర్‌ఎంపీలకు, అక్రమంగా డబ్బులు సంపాదిం చాలనుకునే డాక్టర్లకు వరంగా మారుతున్నాయి. వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేటు ఆసుపత్రులపై అరకొర నిఘా వేస్తున్నారు.

నిబంధనలు అతిక్రమించిన ఆసుపత్రి లపై నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ‘దొరికితేనే దొంగ.. లేకపోతే దొర..’ అన్న చందాన ఆసుపత్రి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమ మార్గం పట్టిన వైద్యులు, సిబ్బంది భ్రూణ హత్యలు చేసి శిశువులను చిదిమేస్తుంటే, ఆ అమానుషాన్ని ఆపాల్సిన వైద్యారోగ్య శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ముడుపులకు ఆశపడుతున్నారు. దీంతో సామాన్యుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ కాసుల దందాలో భాగం అవుతున్న ఆర్‌ఎంపీలకు చెక్ పెడితే అక్రమ అబార్షన్ అపడమే కాదు నకిలీ వైద్యుల ఆగడాలను అరికట్టవచ్చంటున్నారు. పల్లెల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్‌ఎంపీ డాక్టర్లే.

దేవుళ్లను ఎంతగా నమ్ముతారో అంతకన్నా ఎక్కువగా గ్రామాల్లో ఆర్‌ఎంపీలను నమ్ముతారు. కుటుంబంలో ఎవరికీ ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆర్‌ఎంపిల దగ్గరకు పరుగెత్తుకుని వెళ్తారు. అయితే ఆ గుడ్డి నమ్మకమే ఆర్‌ఎంపీ డాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుండగా కొన్నిసార్లు రోగుల ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది. 

ఆర్‌ఎంపీల వైద్యంతోనే.. 

పల్లెల్లో ఆర్‌ఎంపిల క్లినిక్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండగా ఓ తెలుగు సిని మాలో చూసినట్లు అర్హత లేని శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంజక్షన్ల దగ్గర నుండి మొదలుకొని సున్తి వంటి చిన్నపాటి ఆపరేషన్లు వరకు ఎంచక్కా చేసేస్తున్నారు. మరికొందరు అదే క్లినిక్‌కు అనుబంధంగా మెడిక ల్ షాప్స్, పాథాలజి లాబ్స్ నిర్వహిస్తూ రోగ నిర్దారణ పరీక్షలు చేసేస్తున్నారు.

గ్రామాల లో ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకొని రోగం ముదిరిపోయాక డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవారు చాలా మందే ఉన్నారు. అసలు ఆర్‌ఎంపీల వైద్యంతోనే ప్రాణం మీదికి తెచ్చుకొనే వాళ్లు కూడా ఉన్నారు. దీనికి కారణం జిల్లాలో జనాభాకు తగ్గట్టు వైద్యు లు లేకపోవడమే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి దాకా అన్ని స్థాయిల్లో సరైన వైద్యం అందుబాటులో లేదు.

ఇది నల్లగొండ జిల్లా లో ఆర్‌ఎంపీలకు కలిసి వచ్చింది. జబ్బు చేశాక దూర ప్రయాణం చేయడానికి ఓపిక లేక కొందరు... ప్రైవేటు ఆస్పత్రులంటే బిల్లులకు జడిసి ఇంకొందరు ఊళ్లలో అందుబా టులో ఉండే ఆర్‌ఎంపీల దగ్గరే వైద్యం చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా వారు రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు.

పట్టణాల్లో ఉండే ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో.. వైద్యులతో కుమ్మక్కయి ఫలానా ఆస్పత్రికి వెళ్లండ ని రోగులను పంపిస్తున్నారు. ఆర్‌ఎంపీలు పంపిన రోగి వద్ద నుంచి ఆ ఆస్పత్రులు పరీక్షలు, స్కానింగ్లు అంటూ రూ.వేలకు వేలు గుంజుతున్నాయి. అందులో కొంతమొత్తం వీరికి కమీషన్గా చెల్లిస్తున్నాయి. ఆర్‌ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రుల వ్యాపారం మూడు పూవులు, ఆరుకాయలుగా సాగుతోంది.

ప్రైవేట్ హాస్పిటల్స్ కమిషన్ దందాలు

పట్టణాల్లో ఆస్పత్రి యాజమాన్యాలు ఓ నలుగురు పీఆర్వోలను నియమించుకుని, ఊరూరా తిరిగి గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీలను కలిసి సంబంధాలు పెట్టుకుంటు న్నాయి. రోగులను తమ ఆస్పత్రులకు పంపేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. వీటినే ‘రెఫరల్’ అంటారు.

వీళ్లు పంపే రోగుల నుంచి వసూలు చేసే బిల్లుల్లో 30 నుంచి 40 శాతం ఆర్‌ఎంపీలకు రెఫరల్ చార్జీలుగా ఆస్పత్రి యాజమాన్యాలు ముట్టజెపుతున్నాయి. ఈ డబ్బుకు అలవాటు పడిన ఆర్‌ఎంపీలు అవసరం ఉన్నా లేకపోయినా తమ వద్దకు వచ్చే రోగులను పట్టణా ల్లోని ఆస్పత్రులకు పంపించడం మామూలైంది. ఈ మెడికల్ దందాతో సామాన్యులు దగా పడుతున్నారు.