13-05-2025 12:49:56 AM
- కేసు విషయంలో రూ.25 లక్షలు డిమాండ్
- పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
సూర్యాపేట, మే 12 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ స్కానింగ్ సెంటర్ నమోదైన కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు అవినీతి పోలీసులను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ స్కానింగ్ సెంటర్ పై ఇటీవల కేసు నమోదు కాగా ఆ కేసుకు సంబంధించి నిర్వాహకుడిని అరెస్టు చేయకుండా ఉండటంతో పాటు అది సజావుగా నడవాలంటే రూ.25 లక్షలు తమకు ఇవ్వాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీర రాఘవులు డిమాండ్ చేసినట్లు తెలిపారు.
చివరికి రూ. 16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఆ తరవాత నిర్వాహకుడు నల్లగొండ ఏసీబీ యూనిట్ ఆఫీస్ ను సంప్రదించాడన్నారు. దీంతో ఏసీబీ అధికారులు సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై దాడిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులను విచారించి ప్రజావిధులను సక్రమంగా నిర్వహించని కారణంగా అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితులను అడిషనల్ జడ్జ్, ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.