19-09-2025 12:16:03 AM
ఇనాం భూముల ఓఆర్పీ కోసం ఓ రైతు నుంచి రూ.40వేలు డిమాండ్
వనపర్తి, సెప్టెంబర్ 18 ( విజయక్రాంతి ) : లంచం తీసుకుంటూ ఇద్దరుఅధికారులు ఏసీబీ చిక్కారు. కొత్తకోట మండలం నీర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు ఇనాం భూముల ఓఆర్సీ కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్డీఓ అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని కొత్తకోట తహసీల్దార్ కు పంపారు. ఆర్డీవో ఆదేశాల మేరకు తహసీల్దార్ ఇనాం భూములకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆర్ ఐ వాసు,
డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డికి బాధ్యత అప్పగించారు. ఈ మేరకు వీరిరువురు సదరు రైతు నుండి రూ.40 వేలు ఇస్తే నివేదికను అనుకూలంగా ఇస్తామని చెప్పారు. అన్ని డబ్బులు ఇవ్వలేను అని పదేపదే చెప్పినప్పటికీ అధికారులు వినలేదు. దీంతో బాధితుడు ఏసీబీ, అధికారులను సంప్రదించాడు. బాధితుడి ఫిర్యాదుతో రం గంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం కోసం ఆర్‌ఐ వాసు,
డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి డిమాండు చేసినట్లు ఆధారాలను సేకరించి మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం లింగస్వామి, జిలాని, కిషన్ నాయక్, తహసీల్దార్ కార్యాలయంలో సో దాలు నిర్వహించి ఇరువురి అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని అవినీతి అధికారులను శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.