29-12-2025 06:19:06 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మెరుపు దాడులు, ఒకరిద్దరు అధికారుల చర్యలకే పరిమితమా? లేక మున్సిపల్ వ్యవస్థ మొత్తం 'చేతివాటాల నెట్వర్క్'గా మారిందన్న అనుమానాలే ఈ దాడులకు కారణమా? అన్న చర్చ ఇప్పుడు పట్టణమంతా సాగుతోంది. సాధారణ తనిఖీలకంటే భిన్నంగా, గంటల తరబడి సాగిన సోదాలు చూస్తే లోతైన అవినీతి ఆరోపణలే ఏసీబీని ఈ స్థాయిలో అప్రమత్తం చేశాయన్న అభిప్రాయం బలపడుతోంది.
ముఖ్యంగా ఫైళ్ల కదలికే లంచంపై ఆధారపడి ఉందన్న ఆరోపణలు ఏసీబీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. చిన్న పనైనా సరే “ఎవరి ద్వారా వెళ్తే పని అవుతుంది?”, “ఎంత ఖర్చు పెడితే ఫైల్ ముందుకు కదులుతుంది?" అన్న చర్చ మున్సిపల్లో సాధారణమైపోయిందన్న ఫిర్యాదులు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో వ్యక్తిగతంగా లంచం తీసుకునే అధికారులు మాత్రమే కాకుండా మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెంట్ల పాత్రపైనా ఏసీబీ నిఘా పెట్టినట్లు సమాచారం.
టౌన్ ప్లానింగ్ విభాగంలో అనుమతుల పేరుతో డిమాండ్లు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం, నోటీసులు ఇచ్చి మళ్లీ ఉపసంహరించుకోవడం వెనుక పెద్ద మొత్తాల్లో చేతివాటాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. కొందరి నిర్మాణాలకు వెంటనే అనుమతులు, మరికొందరి ఫైళ్లు మాత్రం నెలల తరబడి మగ్గుతున్నాయన్న ఫిర్యాదులు స్థానికుల నుంచి వస్తున్నాయి. అదే విధంగా రెవెన్యూ విభాగంలో పన్నుల సవరణలు, బకాయిల తగ్గింపు, ట్రేడ్ లైసెన్సుల మంజూరు వంటి అంశాల్లోనూ "డబ్బు లేకుండా పని జరగదు” అన్న వాతావరణం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ కోణంలోనే సంబంధిత రిజిస్టర్లు, ఫైళ్లు, డిజిటల్ రికార్డులను ఏసీబీ అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అత్యంత కీలకంగా కాంట్రాక్టు పనుల బిల్లుల చెల్లింపుల్లో 'కమీషన్ సంస్కృతి' నెలకొని ఉందన్న ఆరోపణలే ఈ దాడులకు ప్రధాన బీజమని పలువురు భావిస్తున్నారు. పనులు పూర్తికాకముందే బిల్లులు పాస్ కావడం, నాణ్యత లోపించినా కొలతల పుస్తకాలలో సరిగా చూపించడం, బిల్లులు విడుదల చేయడానికి నిర్దిష్ట శాతం లంచం డిమాండ్ చేయడం వంటి అంశాలపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఎంబీలు, వర్క్ ఆర్డర్లు, చెక్ లిస్టులు, చెల్లింపుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా క్రాస్ చెక్ చేస్తున్నారు. దాడుల సమయంలో మున్సిపల్ కార్యాలయాన్ని పూర్తిగా ఏసీబీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కార్యాలయం లోనికి, బయటకు ఎవరినీ అనుమతించకపోవడం చూస్తే ఆధారాలు నశించకుండా, లావాదేవీల జాడ మాయం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కంప్యూటర్ల హార్డిస్క్లు, ఫోన్ కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్లు వంటి డిజిటల్ ఆధారాలనూ పరిశీలించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా, ఒకరి కంటే ఎక్కువ మంది అధికారులు ఈ 'చేతివాటాల వ్యవహారంలో' పాత్రధారులై ఉండొచ్చన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకరిద్దరిపై చర్యలతో ఈ వ్యవహారం ముగియదని, అవసరమైతే మరింత లోతుగా విచారణ జరిపి పైస్థాయి అధికారుల వరకూ దర్యాప్తు వెళ్లే అవకాశముందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
మున్సిపల్ కార్యాలయం వద్ద గుమిగూడిన ప్రజలు
“ఇన్నాళ్లుగా నలుగురికే లాభం చేకూర్చిన వ్యవస్థను ఏసీబీ బద్దలు కొట్టాలి”, “చిన్న పనికీ లంచం అడిగే పరిస్థితికి శాశ్వత ముగింపు కావాలి” అంటూ తమ ఆగ్రహాన్ని పట్టణవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ తనిఖీలు ముగిసిన తర్వాత బయటపడే నిజాలు జమ్మికుంట మున్సిపల్ పాలనలో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, ఈ ఏసీబీ దాడులు 'చేతివాటాల అనుమానాలు’ అనే కోణంలో మాత్రమే కాదు, మున్సిపల్ వ్యవస్థలో అవినీతి ఎంత లోతుగా వేర్లు వేసిందన్న దానికి అద్దంపడే ఘటనగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు, ఎవరి పాత్ర ఎంతవరకు ఉందన్నది తనిఖీలు పూర్తైన అనంతరం ఏసీబీ ఉన్నతాధికారుల అధికారిక ప్రకటనతో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.