29-12-2025 07:19:37 PM
షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యం...
వినియోగదారుల బేజారు
పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ..
తాండూరు,(విజయక్రాంతి): నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడే టూ వీలర్స్ లలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి మొదటి స్థానంలో ఉంటుందని చెప్పక తప్పదు . ఎంత ఖర్చైనా సరే బుల్లెట్ కొనాలి.. బుల్లెట్ పై తిరగాలి.. అనే కోరికతో అప్పు... సప్పు చేసి బుల్లెట్ బైక్ సొంతం చేసుకుంటున్నారు. నేటి యువకులు ఇంతవరకు బాగానే ఉంది. ఇక బైక్ కొన్నాక సాంకేతిక లోపాలు వస్తే మాత్రం షోరూం చుట్టూ తిరుగుతూ విసిగి వేసారి పోతున్నారు.
బుల్లెట్ బండి వినియోగదారులు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్న రాయల్ ఇన్ ఫీల్డ్ బుల్లెట్ షోరూమ్ నిర్వాహకులు మాత్రం వారి వద్ద కొనుగోలు చేసిన ఎన్ఫీల్డ్ బైక్ లకు తమకు ఏమి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు తీరు పలు విమర్శలకు తావిస్తోంది. బాధిత వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం కోకట్ గ్రామానికి చెందిన బేగారి రవి అనే యువకుడు తాండూర్ రాయల్ ఇన్ ఫీల్డ్ షో రూమ్ లో గత సంవత్సరం బుల్లెట్ బైక్ కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన నెల రోజులకే వాహనంలో సాంకేతిక లోపాలు ప్రారంభం అయ్యాయి.
షోరూం వాహనాన్ని తీసుకెళ్లి మరమ్మతులు చేయించుకున్నాడు. అంతే ఇక ఏడాది నుండి వాహనం తరచూ మోరాయించడంతో షోరూం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తాజాగా గత రెండు రోజుల క్రితం వాహనం లో సాంకేతిక లోపం రావడంతో మళ్లీ షోరూంకు వెళ్లి ప్రశ్నిస్తే . . షోరూం నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయాడు. సదరు షోరూం నిర్వాహకుల వ్యవహారంతో విసిగి వేసారిన బేగారి రవి చివరకు వద్దురా నాయన ఈ బుల్లెట్ బండి అంటూ తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.