calender_icon.png 10 May, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జడ్పీ కార్యాలయంపై ఏసీబీ దాడులు

07-05-2025 12:00:00 AM

  1. 25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సూపరింటెండెంట్ సుధాకర్
  2. నిందితునితోపాటు మరో ఉద్యోగినిపై ఏసీబీ కేసు నమోదు

ములుగు, మే 6 (విజయ క్రాంతి):  సెలవుల డబ్బులు రావలసి ఉండగా, బిల్లు చేయాలని కోరితే సహ ఉద్యోగి అనే కనికరం కూడా చూపకుండా లంచం అడిగిన అధికారిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సాంబయ్య మీడియాకు వెల్లడించారు.

ములుగులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గాదెగోని సుధాకర్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. అదే కార్యాలయంలో వెంకటేష్ అనే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కొన్ని నెలలు మెడికల్ లీవ్ తీసుకున్న ఉద్యోగి తనకు రావాల్సిన మెడికల్ లీవుల జీతంకు సంబంధించి బిల్లులను సిద్ధం చేసి ఎస్టీవో కార్యాలయానికి సమర్పించాలని సూపరింటెండెంట్ ను కోరాడు.

అయితే అందుకు సూపరింటెండెంట్ సదరు ఉద్యోగిని 60వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట సూపరింటెండెంట్ కు 20వేలు, మరో ఉద్యోగిని సౌమ్యకు అదనంగా 5వేలు ఇవ్వాలని తెలిపాడు. మిగిలిన 40వేలు బిల్లు మంజూరు అయ్యాక ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.

న్యాయంగా తనకు రావాల్సిన డబ్బులకు సంబంధించి బిల్లు చేయమంటే లంచం అడగడంపట్ల విసిగిపోయిన ఉద్యోగి వెంకటేష్ వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మంగళవారం ములుగు జడ్పీ కార్యాలయంలో 25వేల లంచం తీసుకుంటుండగా సూపరింటెండెంట్ జి.సుధాకర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

సుధాకర్ తోపాటు ఉద్యోగిని సౌమ్యను అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రత్యేకంగా కెమికల్స్ పరీక్షలు నిర్వహించి లంచం తీసుకోవడాన్ని ధృవీకరించుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి రూ.25వేలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

కాగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1064కు గానీ, లేదా 9440446106 నెంబరులో సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.