23-08-2025 08:46:40 PM
ఎస్ఎఫ్ఐ సమరభేరి జీపు జాత ముగింపు సభలో రాష్ట్ర నాయకులు..
మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజినీకాంత్ అభిప్రాయపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ సమరభేరి జీపు జాత ముగింపు సభకు రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజుతో హాజరై వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్నందు వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోలేక పోతున్నారన్నారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యలు విద్యార్థుల సర్టిఫికెట్స్ కోసం తల్లిదండ్రులను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసుకుని డబ్బులు కట్టలేక, పై చదువులు చదవలేక విద్యని మధ్యలోనే వదిలేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.
ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా ఉన్నత విద్యా వ్యవస్థ బలోపేతనికై ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలనీ, బెల్లంపల్లి నియోజక వర్గంలో ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలనీ, చెన్నూర్ నియోజక వర్గంలో ఎస్సి కుటుంబాలు ఎక్కువగా ఉన్నప్పటికి ఎస్సీ బాలికల, బాలుర హాస్టల్ లేదని, తక్షణమే వాటిని కట్టించాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం తీసుకొచ్చిన పథకానికి కూడా సరైన నిధులు కేటాయించడం లేదని, వాటిని కూడా విడుదల చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల్లోని విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన గదులు లేక ఒకే గదిలో చదువుకోవడం(క్లాస్ రూమ్), పడుకోవడం (డార్మెంటరీ), సరైన ఆట స్థలాలు, బాత్రూముల సౌకర్యాలు లేక అనేక ఇబ్బందుల మధ్య విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
ఇప్పటికైనా సొంత భవనాలు నిర్మించి, శిధిలావస్థలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలన్నారు. విద్యా రంగంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కనీస 30 శాతం విద్యారంగానికి కేటాయించాలని, విద్యా రంగంలో ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి కాబ్బటి తక్షణమే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శి శ్రీకాంత్, అభినవ్, సహాయ కార్యదర్శి నిఖిల్, యాత్ర బృందం నాయకులు నిక్షిత, సాయి వర్షిణి, ప్రదీప్, హర్షవర్ధన్, ప్రతీక్, రాంచరణ్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.