calender_icon.png 27 October, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివశంకర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం

27-10-2025 01:10:45 AM

  1. బైక్ డివైడర్ ఢీకొట్టడంతో కింద పడిపోయాం
  2. ఘటనాస్థలిలోనే శివశంకర్ మృతి 
  3. మృతదేహాన్ని పక్కకు తీద్దామనుకున్నా
  4. ఇంతలోనే బైకును ఓ వాహనం ఢీకొట్టింది
  5. రోడ్డు మధ్యలోకి వచ్చిన బైక్‌ను కావేరి బస్సు లాక్కెళ్లింది
  6. ఉలిందకొండ పోలీసులకు ఎర్రిస్వామి ఫిర్యాదు

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కర్నూల్ జిల్లా చిన్నటేకూర్‌లో జరిగిన బస్సు ప్రమాదం శివశంకర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అతడి స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆదివారం ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌లో ఎర్రిస్వామి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో.. శివశంకర్ మద్యం సేవించి బైక్ నడపడంతో డివైడర్‌ను ఢీకొట్టినట్లు పేర్కొన్నాడు. దీంతో ఇద్దరం కింద పడిపోయామని, శివశంకర్ ఘటనాస్థలిలోనే మృతి చెందాడని తెలిపాడు.

మృతదేహాన్ని పక్కకు తీసేందుకు యత్నిస్తుండగా బైకును ఓ వాహనం ఢీకొట్టడంతో రోడ్డు మధ్యలోకి వచ్చి పడింది. ఆ వెంటనే వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొని కొంత దూరం లాక్కెళ్లిందని చెప్పాడు. దీంతో బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో వివరించాడు. కాగా శివశంకర్ మద్యం సేవించి బైక్ నడిపాడని కర్నూలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్ధారించింది. 

10 మృతదేహాల అప్పగింత

బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వారిలో 10 మంది మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు కర్నూలు ఆసుపత్రి మార్చురీ వద్ద కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో మృతదేహాలను అధికారులు అప్పగించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్సులను ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృతిచెందగా.. కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర అధికారులు రూ.5 లక్షల పరిహారం చెక్కులను అందజేశారు. ప్రమాదంలో 19 మంది మృతిచెందగా.. గుర్తు తెలియని ఓ మృతదేహానికి సంబంధించి చిత్తూరు నుంచి ఒకరు వచ్చారని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా మృతదేహం గుర్తించి, అప్పగిస్తామని చెప్పారు. కాగా ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం తాగలేదని నివేదికలో తేలిందని ఎస్పీ చెప్పారు.