24-09-2025 12:00:00 AM
నల్లగొండ, సెప్టెంబర్ 23(విజయక్రాంతి) : ఓ పక్క హైడ్రా అక్రమ వెంచర్లపై ఉక్కుపాదం మోపుతోంది.. మరోవైపు అవే అక్రమ వెంచర్లు.. నిబంధనల ఉల్లంఘనలు ఉన్నా.. యాదాద్రిభువనగిరి జిల్లా అధికారులకు మాత్రం కన్పించడం లేదు. ఒకటీ కాదు.. రెండు కాదు.. ఏకంగా 200 ఎకరాల వ్యవసాయ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లుగా మార్చేసి.. రంగురంగుల బ్రోచర్లతో కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నా.. అధికారులు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం కొసమెరుపు.
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని కూనూరు గ్రామపం చాయతీ పరిధిలో 17, 38, 39,45 సర్వే నంబర్లలో ఆర్వీజీ డవలపర్స్ సంస్థ రాయల్ రిడ్జ్ రిసారట్స్ పేరుతో భారీ వెంచర్ను ఏర్పాటు చేసింది. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ప్రీకాస్ట్ వాల్స్ను రాత్రికి రాత్రి ఏర్పాటు చేసి.. సదరు భూమిలో ఉన్న కొంగలకుంటను సైతం పూడ్చేసి భారీ వెంచర్కు తెరలేపింది. నిజానికి రాయల్ రిడ్జ్ రిసార్ట్స్కు ప్రభుత్వం తరపు నుంచి ఏలాంటి అనుమతులు తీసుకోలేదు.
సరికదా.. తమకు అన్నీ అనుమతులు ఉన్నాయనే రేంజ్లో రంగురంగుల బ్రోచర్లు ప్రింట్ చేయించి భారీగా ప్రచారం చేశారు. కానీ రాయల్ రిడ్జ్ సంస్థ మోసాన్ని ‘విజయక్రాంతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. స్మాల్ టానర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పేరుతో ఏకంగా 200 ఎకరాల భూమాయ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో సదరు యాజమాన్యం అధికారులను మేనేజ్ చేయడం మొదలుపెట్టడం గమనార్హం.
అయితే అక్రమ వెంచర్ ఏర్పాటుపై ప్రశ్నించినోళ్లకు అమ్యామ్యాలు అప్పగించడం.. లేకుంటే బెదిరింపులకు దిగడం యాజమాన్యానికి పరిపాటిగా మారింది. అధికారులందరికీ పైసల్ ఇచ్చినం.. గజాల లెక్కన కాకుంటే.. గుంటల్లో భూమి అమ్మి తీరుతాం.. మా వెనుక చాలా పెద్దోళ్లు ఉన్నరు.. మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ బెదిరించడం కొసమెరుపు.
అధికారులారా.. కుటుంబాల్ని రోడ్డున పడేయోద్దు..
నిజానికి రాయల్ రిడ్జ్ రిసారట్స్ వ్యవహారం వల్ల భవిష్యత్తులో వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు ఆ వెంచర్లో ఏలాంటి నిర్మాణాలు చేసే పరిస్థితి ఉండకపోవడం వల్ల అసలు సమస్యలు కస్టమర్లకు ఎదురుపడవు. కానీ తీరా నిర్మాణాలు చేసే సమయం వచ్చేసరికి పరిస్థితి దారుణంగా ఉంటుంది. వెంచర్కు ఏలాంటి అనుమతి లేకపోవడం వల్ల అక్రమ నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుంది.
దాంతో హైడ్రా వంటి వ్యవస్థలు అక్రమ నిర్మాణాలను కూకటివేళ్లతో పెకిలించడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో నష్టపోయేది కస్టమర్లే. ఇదిలావుంటే.. రాయల్ రిడ్జ్ రిసారట్స్ వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీ లీడర్ల హస్తం ఉండడం.. అమ్యామ్యాలు అప్పజెప్పడంతో అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అయితే సదరు అక్రమ లేఔ్ప స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు.
వెంచర్లో అడుగుపెట్టిన సిబ్బందిని సదరు ఎమ్మెల్యే సన్నిహితుడు బెదిరిస్తుండడం గమనార్హం. ఓవైపు కొంగలకుంటను పూడ్చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేసినా.. అధికారులు సదరు లీడర్కు భయపడి తూతూమంత్రంగా విచారణ పేరుతో ఇష్యూను క్లోజ్ చేశారు. పేరుకు నాలుగు జెండాలు పీకి.. ఫ్లేక్సీలను తొలగించి చేతులు దులుపుకోవడం కొసమెరుపు.
కానీ వెంచర్లో ప్లాట్లుగా మార్చినా రాళ్లను, హద్దు గోడలపై మాత్రం కనీసం చిన్న గీత కూడా పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అదే హైడ్రా ఓవైపు రూ.కోట్లు విలువ చేసే విల్లాలు, అపార్ట్మెంట్లను కూకటివేళ్లతో పెకిలించి వేస్తుంటే.. ఇక్కడ మాత్రం అక్రమార్కులకు అధికారులు సపోర్టు చేస్తుండడం విడ్డూరంగా ఉంది.
200 ఎకరాలు హాంఫట్..
కూనూరు గ్రామపంచాయతీ పరిధిలోని స్మాల్ టానర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి చెందిన భూములను వెంచర్లుగా మార్చి ప్లాట్లుగా విక్రయించడం వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన ఓ లీడర్ ఈ కథ అంతా నడిపిస్తున్నట్టు సమాచారం. దీనికి ప్రతిపక్షబీఆర్‌ఎస్ లీడర్లు సైతం తోడవ్వడంలో రియల్ ఎస్టేట్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
సదరు వెంచర్ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల వ్యవసాయ భూమిని కొల్లగొట్టి ప్లాట్లుగా చేసేందుకు సదరు ఎమ్మెల్యే సన్నిహితుడు భారీ స్కెచ్ వేశాడు. అందులో భాగంగానే మొదటి విడతలో 13 ఎకరాలను వెంచర్గా మార్చేశాడు. ఒక్కో గజం రూ.8 వేలను రూ.12వేల వరకు విక్రయిస్తూ అమాయక కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఓవైపు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా తీరుతో వందలాది మంది రోడ్లపై కుటుంబాలతో సహా పడ్డారు. అందుకు ప్రధాన కారణం ఎలాంటి అనుమతుల్లేకుండా చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకోవడమే. అయినా అధికారులు మాత్రం అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లపై సవతి ప్రేమ చూపిస్తుండడం గమనార్హం.
కుదిరితే గజాలు.. లేకుంటే గుంటలు..
భువనగిరి మండలం కూనూరు గ్రామపంచాయతీలోని రాయల్ రిడ్జ్ రిసార్ట్స్పై విజయక్రాంతి వరుస కథనాలు ప్రచురించడంతో ప్రజల్లో కొంతమేర అవగాహన వచ్చింది. అయితే దీన్ని మాయ చేసేందుకు సదరు కంపెనీ యాజమాన్యం వీలైతే గజాల్లో.. కుదరకపోతే గుంటల లెక్కన వ్యవసాయ భూమిని విక్రయించేందుకు సిద్దమయ్యింది. ప్రస్తుతం ఆ గ్రామ పంచాయతీ పరిధిలో గజం రూ.5వేలకు మించి లేదు.
కానీ ఆర్వీజీ డవలపర్స్ సంస్థ ఏర్పాటు చేసిన రాయల్ రిడ్జ్ రిసారట్స్ వెంచర్లో గజం రూ.8వేలకు పైగా విక్రయిస్తున్నారు. కార్నర్ బిట్, ఈస్ట్ ఫేజ్ ప్లాట్లకైతే రూ.10వేలకు పైనే. అయితే అన్నీ అనుమతులు ఉన్నాయంటూ రంగురంగుల బ్రోచర్లను చూసి కస్టమర్లు సైతం మోసపోతున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తుండడం గమనార్హం. అసలు వ్యవసాయ భూమిలో గ్రామపంచాయతీ పర్మిషన్ గానీ.
రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి ఏలాంటి అనుమతులు లేకుండా వెంచర్ చేస్తే.. మొత్తం వెంచర్ రూపురేఖలు లేకుండా చేయాల్సిందిపోయి.. దాటవేత ధోరణి అవలంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించినా.. అధికారుల ధోరణి ఇలాఉందంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ప్రజలు మోసపోతున్నారని తెలిసినా.. అధికారులు నాన్చుడి ధోరణిపై ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటారా..? లేక షరా మాములుగానే వ్యవహరిస్తారా..? అన్నది వేచిచూడాలి.