calender_icon.png 24 September, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మూడున్నర దశాబ్దాల విప్లవ యాత్ర..!

23-09-2025 11:27:45 PM

* ఉపాధ్యాయుడి నుంచి మావోయిస్టు అగ్రనేత వరకు ప్రస్థానం

* వికల్ప్ మరణంతో  తల్లడిల్లుతున్న తీగలకుంటపల్లె

* కొడుకు చనిపోయాడన్న సంగతి తెలుసుకోలేని మానసిక స్థితిలో తల్లి

* చెబితే ఏమైపోతాడోనని తండ్రికి విషయం తెలియనివ్వని కుటుంబ సభ్యులు

* కుమిలిపోతున్న బంధువులు

హుస్నాబాద్: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, రాజు దాదా, విజయ్‌ తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగిన అత్యంత ప్రభావవంతమైన మావోయిస్టు నేతల్లో ఒకరు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తుపాకీ  పోరాటం, రాజకీయ చర్చలు, వ్యూహాత్మక ప్రణాళికలతో మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు. విద్యార్థి ఉద్యమం నుంచి ఆయన పయనం మొదలై, ఉపాధ్యాయుడిగా పనిచేసి, లా చదువుకునేందుకని వెళ్లి, తర్వాత దండకారణ్య అరణ్యాలలో కేంద్ర నాయకత్వం వరకు ఎదిగారు.

వికల్ప్ మరణం "ఎన్కౌంటర్" పేరిట ఖరారవ్వడం ఒకవైపు విప్లవ ఉద్యమ శ్రేణుల్లో దుఃఖాన్ని రేపుతుంటే, మరోవైపు తన ఊరైన తీగలకుంటపల్లెను కన్నీటి లోయగా మార్చింది. కొడుకు చనిపోయాడన్న విషయాన్ని అపస్మారక స్థితిలో మంచానికి పరిమితమైన ఆయన తల్లికి ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. “తెలిపితే ప్రాణాలు పోతాయేమో” అన్న భయంతో తండ్రికీ బంధువులు సత్యాన్ని దాచిపెడుతున్నారు. ఇంటి గడపను అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి కండ్లలో నీళ్లు ఎండిపోవడం లేదు.

విద్యార్థి దశలోనే విప్లవపు విత్తనం

1980ల చివర్లో తెలంగాణలో రాడికల్‌ విద్యార్థి ఉద్యమం ఒక విప్లవ తరాన్ని సృష్టించింది. చిన్న పట్టణాల్లో చదువుకుంటున్న యువతలో అసమానతలపై ఆగ్రహం, సామాజిక మార్పు కోరిక బలంగా పెరిగింది. వికల్ప్ కూడా ఈ వాతావరణంలోనే తన ఆరంభం చేశారు.

మొదట రహస్య సమావేశాలు, తర్వాత బహిరంగ నిరసనలు — ఈ దశలోనే ఆయన ప్రసంగ నైపుణ్యం, ప్రజలతో మమేకమయ్యే తత్వం గుర్తింపు తెచ్చాయి. అప్పట్లో రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘాల క్రియాశీలత పెరుగుతుండగా, వికల్ప్ కూడా సిద్దిపేటలో  విద్యార్థులను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్ యూ) వైపు తీసుకువెళ్లాడు. ఇదే ఆయన రాజకీయ బాటలో తొలి అడుగు.

తెలంగాణలో ఆయన ప్రభావం

వికల్ప్‌ ఒక “ఆర్గనైజర్” — ఆయనలోని ముఖ్య లక్షణం ఇదే.

భూమి సమస్యలు: 1990లలో మెదక్, సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాల్లో దళిత, బీద రైతుల భూమి వివాదాలపై పోరాటాల్లో ఆయన పాత్ర ఉన్నది.

ఆదివాసీ హక్కులు: అడవుల్లో బాంబూ, టెండూ ఆకుల కాంట్రాక్టర్ల దోపిడీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలను సమీకరించారు.

మహిళల ప్రశ్నలు: మావోయిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర పెంచే ప్రయత్నాల్లో ఆయన సానుకూలంగా ముందుండేవారని సహచరులు చెబుతారు. ఆయన వ్యూహం ఎప్పుడూ “ప్రజలతో మమేకం” కావడమే. చిన్న చిన్న సమస్యలను తీసుకొని పెద్ద రాజకీయ చర్చలుగా మలచడంలో ఆయన దిట్ట. అందుకే తెలంగాణలో ఆయన పేరు ఒక స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది.

దండకారణ్యంలో వ్యూహకర్త

1990ల మధ్య నాటికి, వికల్ప్‌ను పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి పంపింది. ఆ సమయంలో అక్కడ మావోయిస్టు ఉద్యమం విస్తరిస్తున్నా, నాయకత్వం లోపించేది. ఆయన వెళ్లిన తర్వాత పెద్ద మార్పు వచ్చింది.

గెరిల్లా దళాల విస్తరణ: ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గూడాల్లో కొత్త బేస్ ఏరియాలు ఏర్పాటు చేశారు. 

ప్రజాసంఘాలు: ఆదివాసీల సమస్యలను పరిగణనలోకి తీసుకొని కూలి రేట్లు, భూమి హక్కులు, అరణ్య వనరుల వినియోగం లాంటి అంశాలపై ప్రజా ప్రభుత్వాల నమూనా ప్రారంభించారు. వ్యూహాత్మక దాడులు: భద్రతా దళాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగేలా ప్రణాళికలు రచించడంలో వికల్ప్ పాత్ర ఉన్నదని భద్రతా సంస్థలు గుర్తించాయి. “వికల్ప్ ఎప్పుడూ ‘ప్రజలే మన బలమైన కోట’ అంటుండేవాడు. దాడులు చేసినా, చర్చలు జరిగినా ఆయన మొదటి షరతు ప్రజల రక్షణే.” అని ఆయన సహచరులు అంటారు.

ఆయుధ విరమణ చర్చలు – విభేదాల మబ్బులు

ఇటీవల మావోయిస్టు నాయకత్వంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. పోలిట్‌బ్యూరో సభ్యుడు సోను (అభయ్ పేరుతో) “సాయుధ పోరాటం విరమించడానికి సిద్ధం” అని ప్రకటించాడు. వికల్ప్ వెంటనే స్పందిస్తూ "అది విప్లవ ద్రోహం" అని ఖండించాడు.

ఈ ప్రకటన బయటికి రాకముందే వికల్ప్ పోలీసుల చేతిలో చనిపోవడం సహచరుల్లో అనుమానాలు కలిగించింది. అతని మరణం ఒక “సమయం-సంబంధిత సంఘటన”గా కనిపిస్తోంది. అంటే చర్చలు ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి, విభేదాలను పరిష్కరించకుండా అడ్డుకోవడానికి జరిగిన చర్యగా చూడవచ్చని మావోయిస్టు మద్దతుదారులు అంటున్నారు.

ఎన్కౌంటర్ లేదా భూటకపు హత్య..?

కేంద్ర కమిటీ సభ్యుల చుట్టూ కనీసం 20–30 మంది గెరిల్లాలు రక్షణగా ఉంటారు. ఈ కాల్పుల్లో మాత్రం వికల్ప్‌, కోస మాత్రమే చనిపోవడం “ఎదురుకాల్పులు” అనే అధికారిక వాదనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భద్రతా వర్గాలు ముందుగానే వారిని అదుపులోకి తీసుకుని, సమాచారం రాబట్టి, తర్వాత “ఎన్కౌంటర్” పేరిట హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ ప్రతిస్పందనలు అవసరం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చర్చలకు సిద్ధమని చెప్పినా, ఈసారి ఎన్కౌంటర్ హత్యలపై మౌనం ఎందుకు అనే ప్రశ్న ఉంది. విప్లవాభిమానులు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో నిష్పాక్షిక విచారణ డిమాండ్ చేస్తున్నారు. పౌర సమాజం, రాజకీయ పార్టీలు ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేయాలని వర్గాలు కోరుతున్నాయి.

ఒక విప్లవ గాథ, ఒక ప్రశ్నార్థకం

వికల్ప్‌ జీవితం ఒక విప్లవకథ. విద్యార్థి దశలో మొదలైన ఆరాటం, తెలంగాణలో సాగిన ఉద్యమం, దండకారణ్యంలో వ్యూహాత్మక నాయకత్వం. ఇవన్నీ కలిసి ఆయనను మావోయిస్టు ఉద్యమంలో అగ్రనేతగా నిలిపాయి. ఆయన మరణం మాత్రం ఒక భూటకపు ఎన్కౌంటర్ అనుమానాల నడుమ నమోదైంది. మూడున్నర దశాబ్దాల విప్లవయాత్రకు ముగింపు ఇలావస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ మరణం ఒక వ్యక్తి అంతం మాత్రమే కాదు. విప్లవ చరిత్రలో, చర్చల భవిష్యత్తులో, ప్రభుత్వ వ్యూహాల్లో కొత్త మలుపు.

అంత మేధావిని ఇగ సూడం: నారాయణస్వామి వెంకటయోగి, వికల్ప్ క్లాస్ మేట్

సిద్దిపేట నాసర్ పుర వీధుల్లో కలిసి తిరిగినం. పొలాల్లో  మోట బావుల దగ్గర కలిసి చదువుకున్నం. ఎంతో సన్నిహితంగా గడిపిన రామచంద్రన్న బాల్య స్నేహ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి గుండె చెరువవుతంది. నా ఇంటర్మీడియేట్ అయిపోగానే కలిసి ఇంజనీరింగ్ కు ప్రిపేర్ అవుదామనుకున్నం.  తర్వాత నేను జేఎన్టీయూకు, రామచంద్రన్న లా కాలేజీకి వెళ్లిపోయిండు. తర్వాత రామచంద్రన్న ఉన్నతమైన కార్యాచరణకు ఉద్యమంలోకి వెళ్లాడని తెలిసింది. మళ్లీ ఇప్పుడు ఇట్లా ఈ దుర్వార్త వినాల్సి రావడం నా జీవితంలో అత్యంత విషాదం.

ఆయన పేరు వింటే గర్వంగుంటది: బాపురెడ్డి, వికల్ప్ బాల్య స్నేహితుడు

“ రామచంద్రన్న, నేను కోహెడలో చదువుకున్నం. ఆయన పేరు వినగానే గర్వంగా అనిపిస్తది. ఒకసారి కలిసినప్పుడు లాయర్ గా పనిచేస్తున్న అన్నడు. ఇప్పుడు ఆయనను ఇలా చంపేశారని తెలిసి చాలా బాధైతంది. ఎంత తెలివిమంతుడు. కుటుంబాన్ని వదులుకొని ఇట్ల చనిపాయె.

మా అన్న శవాన్నైనా పంపండి: వెంకటరెడ్డి, వికల్ప్ తమ్ముడు

“మా అన్న రామచంద్రారెడ్డి ఆముదం దీపం కింద ఉండి చదువుకున్నడు. గవర్నమెంట్ టీచర్ అయి, లా చదువుకని వెళ్లిపోయి తిరిగి రాలేదు. తర్వాత అన్నలల్ల కలిసిండని తెలిసింది. నేను ఆర్ఎంపీగా పనిచేస్తూ తల్లిదండ్రులను చూసుకుంటున్న. మా అవ్వ కోమాలో ఉన్నది. నాయిన వయసు మీదపడింది. ఐదేండ్లసంది వాళ్లను చంటిపిల్లలలెక్క చూసుకుంటున్న.  ఇప్పుడు మా అన్న చనిపోయాడని చెబుతున్నరు. కానీ మా మనసు ఒప్పుకోవడం లేదు. ఆయనను పట్టుకొని, తర్వాత చంపేశారనిపిస్తంది. మా అన్న శవాన్నైనా పంపాలని గవర్నమెంట్ ను కోరుతున్న.”