15-09-2025 10:49:28 PM
హనుమకొండ,(విజయక్రాంతి): ఆగష్టు 2025 వరకు వరంగల్ జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖాధికారి గా పనిచేసిన జ్ఞానేశ్వర్ పై చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు దాఖలు అయింది. ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి విద్యాశాఖలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి లక్షల రూపాయలు దండుకొని, ఉపాధ్యాయులను, మానసికంగా, దౌర్జన్యంగా ఒత్తిడికి గురిచేసి, ప్రమోషన్స్, బదిలీ ప్రక్రియలో అడ్డగోలుగా లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడిన జ్ఞానేశ్వర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యావ్యవస్థ నుండి రిమూవల్ చేయాలని కోరుతూ... అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబరు పాలకుర్తి విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. మాజీ డిఈఓ జ్ఞానేశ్వర్ అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ఏఎంఓ సుజన్ తేజ్ ను కులం పేరు ప్రస్తావిస్తూ దూషించి అవమానించారని పేర్కొన్నారు. జిహెచ్ఎం రవీందర్ కు రావలసిన ఇంక్రిమెంట్ డబ్బులు పెండింగ్ లో ఉంచి లంచం ఇస్తేనే పని ముందుకు పోతుందని హెచ్చరించి సదరు ఉపాధ్యాయుడిని భయభ్రాంతుల కు గురి చేశారని ఆరోపించారు. ఉపాధ్యాయుల స్పోజ్ బదిలీలు, పోస్టింగ్ విషయంలో అనేక అక్రమాలు అవినీతి లంచగొండి తనానికి పాల్పడి లక్షల రూపాయలు దండుకున్నారని పేర్కొన్నారు.
పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని ఎయిడెడ్ టీచర్లకు జీవో కు విరుద్ధంగా ఏక మొత్తంలో డిఎ ఏరియర్స్ క్లెయిమ్ చేశారని పేర్కొన్నారు. సస్పెన్షన్ కు గురైన ఉపాధ్యాయుల నుండి లక్షలాది రూపాయలు దండుకొని వారికి తిరిగి పోస్టింగ్స్ ఇచ్చారని పేర్కొన్నారు. డి.ఎస్సీ 2024 పోస్టింగ్ ల సందర్భంగా ఒకే పాఠశాలలో ఎక్కువ ఖాళీలు చూపి అవినీతి అక్రమాలకు పాల్పడి లక్షల రూపాయలు తీసుకొని పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో లంచాలు తీసుకొని రాత్రికి రాత్రే బదిలీ, ప్రమోషన్ ఉత్తర్వులు ఇవ్వడం, తనకు నచ్చిన వారికి నచ్చిన స్కూల్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
కార్యాలయ సిబ్బంది మహిళా ఉద్యోగి అయిన ఏసిజి కె.అరుణపై వేధింపు చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్.యం. ఎ. విజయలక్ష్మి కేసులో సర్దుబాటు ఉత్తర్వులను పక్కనబెట్టి ఆమెపై దుర్భాషలు మాట్లాడుతూ, బెదిరింపులకు గురి చేస్తూ వాట్సాప్ లో తప్పుడు మెసేజ్ లు పెడుతూ భయాందోళనకు గురి చేసినట్లు జ్ఞానేశ్వర్ పై ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.జ్ఞానేశ్వర్ అవినీతిపై ఉన్నత అధికారులకు పలు ఉపాధ్యాయ సంఘాలు 21 డిమాండ్లతో జిల్లా యంత్రాంగానికి మొరపెట్టు కున్నప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతను ఇష్టానుసారం ప్రవర్తిస్తూ లక్షల రూపాయలు సంపాదించి ప్రస్తుతం నిర్మల్ జిల్లాకు బదిలీ కాబడినారని అయితే అక్కడ సైతం అవినీతికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కావున జ్ఞానేశ్వర్ అవినీతి అక్రమ ఆస్తులపై ఎసిబి, ఈ.డి. ఎంక్వైరీ చేయించి, అతని అవినీతి అక్రమాలపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, ఉద్యోగం నుండి వెంటనే రిమూవ్ చేయాలని కోరుతూ అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మరియు వరంగల్ జిల్లా ఎస్సీఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెంబర్ పాలకుర్తి విజయ్ కుమార్ వరంగల్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు.