calender_icon.png 14 November, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ పదోన్నతులపై చర్యలు తీసుకోవాలి

20-05-2024 01:16:38 AM

ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే19(విజయక్రాంతి): ఓయూలో సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, ప్రొఫెసర్ల పదోన్నతుల అక్రమాలపై తిరుపతిరావు కమిటీ రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ కార్యదర్శి  నెల్లి సత్యం డిమాండ్ చేశారు. సీని యర్ ప్రొఫెసర్ల అక్రమాల చిట్టాను ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం దృష్టికి తీసుకెళ్లామని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త వహించాలని సూచించారు.

కాగా ఓయూ వీసీగా ప్రొఫెసర్ డీ.రవీందర్ నియామకమైన అనంతరం ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అడ్వాన్స్‌మెంట్ స్కీం కింద 51 మంది ప్రొఫెసర్లను సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించారని గుర్తు చేశారు. తనకు అనుకూలంగా ఉన్న ప్రొఫెసర్లను యూజీసీ, యూనివర్సిటీ నిబంధనలు పాటించకుండా, పక్షపాత ధోరణితో వీసీ పదోన్నతులు కల్పించారని ఆరోపించా రు. అన్ని అర్హతలు ఉన్న పలువురు సీనియర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ వారికి పదోన్నతులు కల్పించకుండా అన్యాయం చేశారని విమర్శించారు.

ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాలంటే ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పని చేసిన అనుభవం ఉండాలని,యూజీసీ కేర్‌లిస్ట్‌లో కనీసం పది ప్రచురణలు ఉండాలని చెప్పారు. పదోన్నతి పొందాలంటే ఆ ప్రొఫెసర్ పర్యవేక్షణలో కనీసం ఇద్దరు విద్యార్థులు పీహెచ్‌డీ డిగ్రీ పొంది ఉండాలని పేర్కొన్నారు. కానీ పలువురు ప్రొఫెసర్లకు నాలుగు, ఐదు ఆర్టికల్స్ ఉన్నా పదోన్నతులు కల్పించారని విమర్శించారు.

అక్రమాలపై ఓయూ టీచర్స్ యూనియన్, విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని నియమించి, ఆ కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించిందని గుర్తు చేశారు. కానీ ఆ రిపోర్టును ఇప్పటికీ బహిర్గతం చేయలేదని, అక్రమాలకు పాల్పడిన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 

అక్రమాలకు పాల్పడి సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన పలువురు యూనివర్సిటీ వీసీల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని, వారికి వీసీలుగా అవకాశమిస్తే రాష్టవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.