calender_icon.png 17 May, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్టు నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలి..

17-05-2025 06:08:15 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

ములకలపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో సీతారామ ప్రాజెక్టు కాలువపై కట్టిన పాకేజ్ పిల్లర్ కూలిన ప్రదేశాన్ని బిజెపి నాయకులు శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మొదలు కాకముందే పిల్లర్లు కూలుతున్నాయని, రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడుతున్నాయన్నారు. గత కేసిఆర్ ప్రభుత్వం మొదట సుమారు రూ.6,700 కోట్ల వ్యయంతో ఈ సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, ఆ తరువాత ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ 13,500 వేల కోట్లకు పెంచిందని, ప్రస్తుతం ఏకంగా రూ 19,800 కోట్లకు ప్రతిపాదనలు ఈ ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు.

ఈ సీతారామ ప్రాజెక్టు సుమారు 100 కిలోమీటర్ల పైన ఈ జిల్లాలో రెండు ప్రధాన కాలువలతో నిర్మాణం జరిగిందని, 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు, కానీ గత వర్షకాలంలో పడ్డ వర్షపు నీళ్లతో అంటే సుమారు 400 క్యూసెక్కుల నీటి ప్రవాహానికే పాల్వంచ మండలం బండ్రుగొండ వద్ద, చండ్రుగొండ వద్ద మరి కొన్ని చోట్ల ఈ రెండు కాలువలకు గండ్లు పడ్డాయన్నారు. అదే విధంగా కొద్దీ పాటి ప్రవాహానికే సీతారామ ప్రాజెక్టు కాలువ పై ములకలపల్లి మండలం లో పుసుగూడెం గ్రామం లోని కాలువపై కట్టిన పాసేజ్ బ్రిడ్జ్ పిల్లర్ కుప్పకూలి పోయింది, ట్రయల్ రన్ చెయ్యగానే ఈ రెండు కాలువల సైడ్ కాంక్రేట్ పెచ్చలు పెచ్చలు గా ఊడిపోతుందని అన్నారు. వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అవసరాల కోసం శాశ్వతంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పుర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే పేక మేడలాగా కూలిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ధ్వజమెత్తారు.

సీతారామ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ వద్ద గత ప్రభుత్వం భారీఎత్తున కమిషన్ తీసుకుందని, గత ప్రభుత్వ పెద్దలకు ఆ నిర్మాణ సంస్థ వారు  బంధువులు కాబట్టే ఎలా నిర్మించిన బిల్లులు వస్తాయి అనే ధైర్యంతో ఎటువంటి నాణ్యత లేకుండా అడ్డగోలుగా ప్రాజెక్టు పనులు చేపట్టారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ తో ఎటువంటి సంబంధం లేకుంటే తక్షణమే ఈ నిర్మాణ సంస్థ చేసిన పనుల మీద పూర్తి స్థాయి లో దర్యాప్తు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సంస్థ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీజేపీ పార్టీ తరుపున డిమాండ్ చేశారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నాణ్యత లేకుండా సీతారామ ప్రాజెక్టు నిర్మించిన సంస్థపై బీజేపీ అధిష్టానానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ములకలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్ తంగెళ్ళ ఆంజనేయులు అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు  జుబ్బూరి రమేష్ బానోత్  మల్లేష్  బానోత్ సుధారాణి తేజావత్ పార్వతి తేజావత్ సూర్యం రవికుమార్ ధరావత్ వెంకన్న వాంకుడోత్ వీరు నాయక్ శివ గూగులోత్ వంశి తదితరులు పాల్గొన్నారు.