22-08-2025 01:02:39 AM
జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
మహబూబ్ నగర్ ఆగస్టు 21 (విజయ క్రాంతి) : నిర్దేశించిన సమయంలోపు 2024- వానాకాలం సీజన్ కు సంబంధించి సి.యం.ఆర్ ధాన్యం ను డెలివరీ చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహరెడ్డి మిల్లర్లను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ కలెక్టర్ ఛాంబర్ లో వానాకాలం 2024- సి .ఏం.ఆర్ డెలివరీపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైస్ మిల్లులో నిలువ ఉన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి సరఫరా చేయాలని మిల్లర్లను ఆదేశించారు. వానాకాలం 2024- ధాన్యం గడువు సెప్టెంబర్ 12 వరకు భారత ప్రభుత్వం పొడిగించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సీజన్ లో 72105 మెట్రిక్ టన్నులు బియ్యం డెలివరీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 59,306 మెట్రి టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అంటే 82% డెలివరీ చేయడం జరిగిందని తెలిపారు. మిగతా 12800 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని నిర్దేశిత గడువులోపు డెలివరీ చేయాలని ఆయన సూచించారు.
సి.ఎం.ఆర్ రైస్ సమయానికి సరఫరా చేయడం ద్వారా పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందించే ఆహార భద్రతలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుందని ఆయన అన్నారు. సన్న బియ్యాన్ని సమర్థవంతంగా డెలివరీ చేయాలని సూచించారు. ప్రతి రైస్ మిల్లులో నిలువ ఉంచిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎ. రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ డీ టీలు, మిల్లర్లు, పాల్గొన్నారు.