30-08-2025 02:10:07 PM
డీప్ ఫేక్ టెక్నాలజీ, సైబర్ భద్రతలపై సమగ్ర అవగాహన కల్పించిన పరిశ్రమ నిపుణులు
పటాన్ చెరు,(విజయక్రాంతి): గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం (సీఎస్ఈ) ఆధ్వర్యంలో ‘సైబర్ భద్రతలో డీప్ ఫేక్ బెదిరింపులు: గుర్తింపు, నివారణ, నైతిక సవాళ్లు’ అనే అంశంపై రెండు వారాల (12 రోజుల) అధునాతన అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్ డీపీ) శనివారం విజయవంతంగా ముగిసింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) శిక్షణ, అభ్యాసం (ఏటీఏఎల్) అడ్వాన్స్ డ్ పథకం కింద ఆగస్టు 18-30 వరకు దీనిని ఏర్పాటు చేశారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) సృష్టించిన సింథటిక్ మీడియా యొక్క పెరుగుతున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి అధ్యాపకులు, పరిశోధకులను అధునాతన జ్జానం, ఆచరణాత్మక నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి ఈ ఎఫ్ డీపీని లక్ష్యించారు. డీప్ ఫేక్ జనరేషన్ మెకానిజమ్స్, సైబర్ మోసం, తప్పుడు సమాచారం, దొంగతనాన్ని గుర్తించడం, ఏఐ ఆధారిత గుర్తింపు పద్ధతులు, ప్రతికూల రక్షణ వ్యూహాలు, నైతిక పరిశీలనలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఐఐటీ హైదరాబాదు, త్రిబుల్ ఐటీ హైదరాబాదు, హైదరాబాదు విశ్వవిద్యాలయం, ఐబీఎం, గూగుల్, టెక్ మహీంద్రా, ఇతర ప్రముఖ ఐటీ సంస్థల ప్రముఖులు పలు నైపుణ్యాలపై ఉపన్యాసాలు, కేస్ స్టడీలు, ఆచరణాత్మక శిక్షణ ఇచ్చారు. డీప్ ఫేక్ ముప్పులకు వ్యతిరేకంగా సైబర్ భద్రతను బలోపేతం చేయడంపై ఇందులో పాల్గొన్న వారికి విలువైన అంతర్దృష్టులను అందించారు.
ఈ అధ్యాపక వికాస కార్యక్రమంలో భాగంగా నాలుగు పారిశ్రామిక సందర్శనలను కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలోని అతిపెద్ద ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ అయిన టీ-హబ్, భారతదేశపు అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం టీ-వర్క్స్, ఐఐటీ హైదరాబాదులోని టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ – అందులోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ జీఎంఆర్ గ్రూపు ఆవిష్కరణ విభాగం జీఎంఆర్ ఇన్నోవెక్స్ లను సందర్శించి, అక్కడి ఆవిష్కరణలు, స్మార్ట్, స్థిరమైన మౌలిక సదుపాయాలపై విలువైన అనుభవాన్ని పొందారు. డీప్ ఫేక్ టెక్నాలజీల యొక్క సమగ్ర అవగాహన, గుర్తింపు పద్ధతులలో నైపుణ్యం, మెరుగైన సైబర్ భద్రతా అవగాహన, ప్రతిఘటనల అమలు, నైతిక, చట్టపరమైన దృక్పథాల గురించి తెలుసుకున్నారు. అలాగే పరిశోధన, పాఠ్యాంశాల అభివృద్ధి, పరిశ్రమ ఔచిత్యం కోసం అవకాశాలు వంటి కీలకమైన అంశాలపై పట్టు సాధించారు. ఎఫ్ డీపీ సమన్వయకర్త ప్రొఫెసర్ అక్కలక్ష్మి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.