09-08-2025 02:21:58 AM
బంజారాహిల్స్‌లోని ఆస్పత్రిలో ప్రారంభం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): అడ్వాన్స్‌డ్ హార్ట్ ఫెయిల్యూర్ సమస్యల గుర్తింపు, చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో అడ్వాన్స్‌డ్ హార్ట్ రిథమ్ క్లినిక్‌ను శుక్రవారం కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్ ప్రారంభించారు. కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ క్లినికల్ డైరెక్టర్, ప్రఖ్యాత ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ ఎస్వీకే నాయకత్వం వహించనున్నారు. ఈ ప్రత్యేక క్లినిక్ హైదరాబాద్‌లో గుండె సంరక్షణలో ఒక పెద్ద పురోగతి.
ఇది ఏట్రియల్ ఫైబ్రిలేషన్, బ్రాడీకార్డియా, టాచీకార్డియా వంటి లయ సమస్యలతో బాధపడుతున్నవారికి, అలాగే ఆకస్మిక గుండె మరణం ప్రమా దం ఉన్న రోగులకు ప్రయోజనం చేకూర్చడానికి రూపొందించబడింది. ముఖ్యంగా గుండె పోటు, గుండె వైఫల్యం, వాల్వ్ లోపాలు, జన్యుపరమైన అరిథ్మియా సిండ్రోమ్ల చరిత్ర ఉన్న రోగులకోసమే ఈ క్లినిక్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్‌లో అనేక విభాగాలు, ప్రోటోకాల్ ఆధారిత చికిత్సా విధానాల తో సేవలు అందిస్తున్నారు.
ఇందులో ఈసిజి, హోల్టర్ మానిటరింగ్, టిఎంటి, ఎలక్ట్రోఫిజియాలజిస్ స్టడీస్, 3డి ఎలక్ట్రోఅనాటమికల్ మ్యాపింగ్ వంటి పరీక్షలు ఉన్నాయి. అలాగే పేస్మేకర్, ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్, కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ, కండక్షన్ సిస్టమ్ పేసింగ్ వంటి డివైస్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్వెన్షనల్ చికిత్సలలో రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్, క్రయో అబ్లేషన్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, రోగుల దీర్ఘకాలిక సంరక్షణకూ ప్రత్యేక దృష్టి కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ పాల్గొన్నారు.