27-09-2025 01:07:23 AM
మందమర్రి,(విజయక్రాంతి): ప్రభుత్వం అడ్వాన్సుడ్ టెక్నాలజీ కేంద్రాలతో నిరుద్యోగ యువతకు అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని మంచిర్యాల, నస్పూర్, మందమర్రి ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లను సందర్శించి పనుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 27న అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు.
నిరుద్యోగ యువతకు నూతన పరికరాల ద్వారా అధునాతన సాంకేతిక విద్యను అందించే విధంగా ప్రభుత్వం ఏటిసి లను ఏర్పాటు చేసిందన్నారు. యువత ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వృత్తి విద్యలో నైపుణ్యత సాధించి, స్వయం ఉపాధి పొందాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి, మండల పరిధిలో కొనసాగుతున్న పనుల పురోగతి వివరాలను పరిశీలించారు. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజా సంక్షేమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా ఇతర కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.