calender_icon.png 21 May, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయబార పదవికి కళంకం

05-05-2024 12:05:00 AM

స్మగ్లింగ్ కేసులో భారత్‌లోని అఫ్గాన్ రాయబారి 

దుబాయ్ నుంచి 25 కేజీల బంగారం స్మగ్లింగ్

న్యూఢిల్లీ, మే 4: ఉన్నత పదవిలో దేశాలకు వన్నె తెచ్చే రాయబారులను చూశాం. కానీ అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ రాయబారి మాత్రం ఆ పదవికి కళంకంగా మారారు. భారత్‌లోని అఫ్గానిస్థాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్ధక్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఆమె రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని భారత్‌కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించడంతో ఆమెను పక్కా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 25న ముంబై ఎయిర్‌పోర్టులో  ఈ ఘటన జరిగింది.

ఏం జరిగిందంటే.. 

వార్ధక్ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుసుకున్న అధికారులు ముంబై విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబై చేరుకున్నారు. రాయబారి కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు లభించింది. అయితే ఎయిర్‌పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. తొలుత బంగారం గురించి ఆరా తీయగా, ఆమె తోసిపుచ్చారు. తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లి మహిళా సిబ్బంది తనిఖీ చేయగా.. 25 బంగారు కడ్డీలను ఆమె జాకెట్, ప్యాంటు, మోకాలి క్యాప్, బెల్ట్‌లో పెట్టుకున్నారు. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమె రాయబారి కావడంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదు.