04-10-2025 12:00:00 AM
-జడ్పీ స్థానాలపై కసరత్తు
-20 ఏండ్ల తర్వాత ఎస్సీలకు రిజర్వేషన్
-కీలకంగా మారిన నాలుగు స్థానాలు
-బరిలోకి దిగనున్న తాజా, మాజీ ఎమ్మెల్యేల కుటుంబాలు జడ్పీ చైర్ పర్సన్
-దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు
రంగారెడ్డి/చేవెళ్ల, కందుకూరు అక్టోబర్ 3 (విజయక్రాంతి) : రంగారెడ్డి జడ్పీ పీఠంపై ప్రధాన రాజకీయ పార్టీలు గురిపెట్టాయి. 20 ఏండ్ల తర్వాత ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆ కేటగిరికి చెందిన నేతలు కసరత్తు మొదలు పెట్టారు. ఎస్సీలకు అలాగ్ చేసిన నాలుగు స్థానాలపై ఫోకస్ పెట్టారు.
జిల్లాలో 21 జడ్పీటీసీలు ఉండగా చేవెళ్ల, కందుకూరు, షాబాద్, శంకర్ పల్లి స్థానాలు ఎస్సీ వర్గానికి కేటాయించారు. ఇందులో షాబాద్, కందుకూరు మహిళలకు అలాట్ చేశారు. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ ఎస్ పార్టీల నాయకులు ఈ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆశావహులు సైతం రాజకీయ వ్యూహాలు, సమీకరణలతో పాటు పార్టీ పెద్దల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్నారు.
అన్ని స్థానాల్లోకి మహిళలకు అవకాశం..
జడ్పీ చైర్మన్ పదవి కోసం మహిళకు కేటాయించిన షాబాద్, కందుకూరు స్థానాలే కాదు.. జనరల్ స్థానాలైన చేవెళ్ల, శంకర్ పల్లిలోనూ మహిళలనే బరిలోకి దింపే అవకా శం కనిపిస్తోంది. స్పెషల్ గా మహిళలకే కేటాయించినా అక్కడ ఓడిపోతే తమకు అవకా శం దక్కుతుందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పాటు పార్టీ మండల, జిల్లా అధ్యక్షులు కూడా ఈ స్థానాల్లో ఎవరిని పెడదామని తర్జనభర్జన పడుతున్నారు. రాజకీయ సమీకరణలు, ఆర్థిక పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కొడుకు..
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కొడుకు మొయినాబాద్ తాజా మాజీ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ బరిలో ఉండనున్నట్లు సమాచారం. జనరల్ కు కేటాయించిన చేవెళ్ల, శంకర్ పల్లి స్థానాల్లో శ్రీకాంత్ లేదా ఆయన భార్య ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. షాబాద్ లోనూ కాంగ్రెస్ నియోజక వర్గ ఇంచార్జి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన పామెన భీమ్ భరత్ కుటుంబం నుంచి కూడా ఒకరు పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కూడా జడ్పీ చైర్ పర్సన్ దక్కించుకునేందు ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్ తరఫున శేరి కుటుంబం నుంచే..
ఇక బీఆర్ ఎస్ తరఫున చేవెళ్ల జడ్పీ టీసీ అభ్యర్థిగా ముడిమ్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్ బరిలో నిలవనున్నట్లు సమాచారం. అయితే నాన్చే రు గ్రామానికి చెందిన మాజీ కనీస వేతనాల కమిటీ చైర్మన్ నారాయణ కూడా టికెట్ ఆశిస్తుండడంతో అధిష్టానం కాస్త టైం తీసుకొం టున్నట్లు తెలుస్తోంది. ఇక షాబాద్ నుంచి , కేటిఆర్ సన్నిహితుడు మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తికి అవకాశం దక్కనుంది. చేవెళ్ల జడ్పీ పీఠం ఎవరి వశమవుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
కీలకంగా కానున్న కందుకూరు..
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల జెడ్పిటిసి స్థానం కీలకంగా మారనుంది.ఈఎన్నికల్లో ఎలాగైనా జిల్లా పరిషత్ చైర్మన్ కందుకూరు మండలానికి వరించేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీ కందుకూరు మండలంలోనే ఉంది. దీంతో జడ్పిటిసి ఎన్నికలు ఇక్కడ రసవత్తరంగా మారనున్నాయి.రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం ఎస్సీ మహిళకు కేటాయించడంతో దానికి అనుగుణంగా కందుకూరు మండల జడ్పిటిసి ఎస్సి మహిళకు కేటాయించడంతో ఈప్రాంతానికి మరింత ప్రాధాన్యం లభించినట్లు అయింది.
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కందుకూరు, మహేశ్వరం రెండు మండలాలు ఉండగా అందులో మహేశ్వరం మండలం బీసీకి, కందుకూరు మండలం ఎస్సీ మహిళ స్థానంకు కేటాయించారు. ఎలాగైనా కందుకూరు మండలంలో జడ్పిటిసి స్థానానికి పోటీ చేయాలనే ఆత్రుత ఆశావాహుల్లో నెలకొంది.ముఖ్యంగా పలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బిజెపి,బిఆర్‌ఎస్ నాయకులు జెడ్పిటిసి స్థానం బరిలో కొంత రాజకీయ అనుభవం ఉన్నవారికి టికెట్లు కేటాయించాలని అనుకుంటున్న నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.
ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిభట్ల ప్రాంతానికి చెందిన మాజీ జెడ్పిటిసి భూపతి గల్లా మహిపాల్ ఆయన సతీమణిని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.బిజెపి పార్టీ నుండి తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మంద జ్యోతి పాండు రంగంలో ఉంటున్నట్టు సమాచారం.బిఆర్‌ఎస్ లో మాత్రం త్రిముక పోటీ ఉన్నట్లు సమాచారం.
అందులో దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఇందిరా దేవేందర్ గతంలో సర్పంచ్ గా ఎంపీటీసీగా పదవులు నిర్వహించారు. లేమూరు గ్రామానికి చెందిన డోర్వతి పరంజ్యోతి,గఫూర్ నగర్ గ్రామానికి చెందిన పొట్టి జయశీల ఆనందులు జెడ్పిటిసి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.అన్ని రాజకీయ పార్టీల నాయకులు కందుకూరు మండల జడ్పిటిసి స్థానానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చి ఎలాగైనా తమ పార్టీ నుండి అభ్యర్థులను గెలిపించుకొని జడ్పి చైర్ పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అటు కాంగ్రెస్, బి ఆర్‌ఎస్,బిజెపి నాయకులు ఇప్పటినుండే సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వవినీయవర్గాల ద్వారా తెలిసింది.
కాంగ్రెస్ నుంచి కె ఎల్ ఆర్ అన్ని తానై నడిపిస్తున్నారు.బిఆర్‌ఎస్ నుండి మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా రెడ్డి ఒక సవాలుగా తీసుకొని ఎలాగైనా కందుకూరు జడ్పిటిసి స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.అలాగే బిజెపి నుండి అందెల శ్రీరాములు,మాజీ రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు,నాయకులు కలిసి ఈసారి కందుకూరు మండలంలో కమలం వికసించే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా ఇక్కడి ప్రాంతం నుంచి జెడ్పిటిసి సభ్యురాలుగా గెలిచిన వారికే రంగారెడ్డి జడ్పీపీఠం వరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు స్పష్టమైన సమాచారం.