calender_icon.png 21 November, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్టంత కొడుకును కోల్పోయాం!

25-07-2024 12:00:00 AM

చేతికి అందివచ్చిన బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులు.. ఇంటి పెద్దలను కోల్పోయి కుటుంబాలు.. అల్లాడుతున్నాయి. అలాంటి గాధలు తెలంగాణ గడ్డమీద ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి అమరుడు సురేశ్ నాయక్ కథ. “చెట్టంత కొడుకు టీచర్ ఉద్యోగం పొంది మమ్మల్ని సల్లగ చూస్తాడనుకున్నం.. మా కండ్లముందే కరెంట్ తీగలకు బలవుతాడను కోలేదు” అని సురేశ్‌నాయక్ తల్లి అన్నారు. తన ఆత్మబలిదానంతోనైనా తెలంగాణ వస్తుందని ప్రాణత్యాగం చేసిండని మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాదులూరు గ్రామానికి చెందిన అమరుడు సురేశ్ తల్లి కెతావత్ తమ్నీబాయి తన ఆవేదనను వెల్లిబుచ్చారు. 

అది 2010 జనవరి నెల. తెలంగాణ ఉద్యమ పోరాటం కొనసాగుతుంది. జిల్లాలో అన్ని వర్గాల నుంచి ప్రజలు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. కాదు లూరు గ్రామానికి చెందిన కెతావత్ సురేశ్‌నాయక్ బీఈడీ చేసి సొంత గ్రామంలోనే విద్యావాలంటీర్‌గా పనిచేసేవాడు. డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో శక్తివంచన లేకుండా పోరాడాడు. తాను చనిపోతేనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందని నమ్మి 2010 జనవరి తొమ్మిదొవ తేదీన ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొని కరెంట్ తీగలకు బలయ్యాడు. సురేశ్ నాయక్ ఆత్మబలిదానాన్ని బీఆర్‌ఎస్ ప్రభు త్వం గుర్తించి అమరవీరుల జాబితాలో రూ.10లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించింది. 

 ఏజీబు చంద్రశేఖర్‌రావు, 

మెదక్, విజయక్రాంతి

తెలంగాణ కోసం బెంగపడేవాడు..

తెలంగాణ కోసం ఉద్యమం లో తిరిగెటోడు. ఎక్కడ లొల్లి జరిగినా, వినిపించినా పరిగెత్తెటోడు. చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు వస్తలేవని, తెలంగాణ వస్తేనే బతుకులు బాగుపడతాయని చెప్పేటోడు. ఏమనిపించిందో ఏమో తాను సస్తేనే తెలంగాణ వస్తదనుకున్నాడు. మా కండ్లముందే మా పెద్ద కొడుకు కాటికిపోయిండు. 

 తల్లి తమ్నీబాయి

ప్రభుత్వం గుర్తించింది..

మా అన్న తెలంగాణ ఉద్య మం కోసం ప్రాణ త్యాగం చేసిండు. ఆయన తమ్మునిగా గర్వంగా ఉంది. మా అన్న ప్రాణత్యాగాన్ని ఆలస్యమైనా 2016లో బీఆర్‌ఎస్ సర్కార్ గుర్తించింది. మా కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసింది. అలాగే నాకు జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చింది. భూమి ఇస్తామన్నారు గానీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. 

 తమ్ముడు కెతావత్ నారాయణ