01-10-2025 12:27:33 AM
ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుంచి వచ్చిన తొలిచిత్రం ‘హనుమాన్’. ఇది పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో పీవీసీయూ రూపొందిస్తున్న తాజాచిత్రం ‘మహాకాళి’పై అన్నివర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.
ఫీమేల్ సూపర్ హీరో మూవీగా రూపొదుంతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి కాగా, డిసెంబర్ నాటికి మొత్తం షూటింగ్ ముగించేలా టీమ్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. బ్లాక్‌బస్టర్ ‘ఛావా’లో ఔరంగజేబుగా ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా ‘మహాకాళి’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇది ఆయనకు తెలుగులో తొలిచిత్రం. సినిమాలో అక్షయ్ పాత్రను పరిచయం చేస్తూ అతని ఫస్ట్‌లుక్‌ను టీమ్ మంగళవారం రిలీజ్ చేసింది. హిందూ పురాణాల్లో అసురుల గురువుగా పేర్కొనే శుక్రాచార్యుడు పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నట్టు వెల్లడించారు. ఈ పోస్టర్‌లో ఒక భారీ పర్వత కోట ముందు నిలబడి ఉన్నట్టున్న అక్షయ్ ఖన్నా లుక్ ఆకట్టుకుంటోంది.
దేవతలు, దానవులు.. ఇద్దరి భవితవ్యాన్ని మలిచిన మహర్షి పాత్రలో అక్షయ్ ఖన్నాను చిత్రంలో అద్భుతంగా చూపించబోతున్నట్టు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి; సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు; ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర తంగాల; ఎడిటర్: సాయిబాబు తలారి.