13-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12 , (విజయక్రాంతి):డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుండి యూజీ,పీజీ కోర్సులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థినీ విద్యార్థులకు హాస్టల్లో అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థుల వసతి కోసం జరుగుతున్న సివిల్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,యూనివర్సిటీలో విద్య నభ్యసించేందుకు సుదూర గ్రామాలు, పట్టణాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు రానున్నందున, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా హాస్టల్ గదులు, శానిటేషన్, తాగునీరు, భోజనశాల, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్, వంటి అన్ని మౌలిక సదుపాయాలను సమయానుకూలంగా పూర్తి చేయాలని సూచించారు.
విద్యార్థుల విద్యా ప్రగతికి అనుకూల వాతావరణం నెల కొల్పడమే కాకుండా, వారి ఆరోగ్యం భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించా రు.అదే విధంగా, యూనివర్సిటీ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా విస్తృతo గా ప్లాంటేషన్ చేపట్టాలని, హాస్టల్ పరిసరాలను శుభ్రంగా, సక్రమంగా నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
భవిష్యత్లో యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులకు ఇది ఒక ఉత్తమ విద్యా వాతావరణం అందించేలాగా అన్ని విభా గాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.