08-10-2025 12:00:00 AM
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దఫాలుగా పోలింగ్ జరగనుంది. అదే నెల 14న ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. అయితే ఎన్నడూ లేనంతగా ఈసారి బీహార్ ఎన్నికలపై అందరి దృష్టి పడడానికి కారణాలు అనేకం.
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న 17 కొత్త సంస్కరణలు బీహార్ ఎన్నికల నుం చే మొదలుకానున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను కుదించడం, ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును ముందుకు జరిపి తప్పనిసరి చేయడం లాంటివి స్వాగతించాల్సిన అంశాలు. ఇదే సమయంలో ఈసీ చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) వివాదాస్పదంగా మారడం, ఈ వివాదం విపక్షాలకు, ఈసీ మధ్య ఘర్షణను సృష్టించింది.
ఎస్‌ఐఆర్ ద్వారా బీహార్‌లో దాదాపు 50 లక్షల ఓటర్లు పేర్లు తొలగించిన తర్వాత తుది జాబితాలో మిగిలిన 7.42 కోట్ల మంది ఓటర్లు బీహార్ రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. అయితే ‘ఓట్ చోరీపై’ రాహుల్ చేసిన ఆరోపణలు ఎన్నికల సంఘాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఈసీ కుమ్మక్కయిందని, జాబితా ప్రక్షాళన పేరుతో ఓట్లను గల్లంతు చేశారని విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి.
అయితే బీహార్ ఓటర్లను హస్తగతం చేసుకునేందుకు ఆయా పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో నిర్వహించిన ర్యాలీ స్థానికంగా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి మంచి బూస్టప్ ఇచ్చింది. మరోవైపు బీహార్‌లో బీజేపీ ఇప్పటివరకు సొంతంగా అధికారంలోకి రాలేదు. అ యితే కేంద్రంలో ఎన్డీయేకు మద్దతిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నే తృత్వంలోని జేడీయూతో మరోసారి కూటమి కట్టక తప్పలేదు.
కాంగ్రెస్, ఆర్జేడీ సహా ఇతర పార్టీలు మరోసారి పొత్తు కూడేటట్లుగా కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో బరిలోకి దిగి 75 చోట్ల నెగ్గితే.. కాంగ్రెస్ 70 స్థానాలకు 19 చోట్ల మాత్రమే గెలుపొందింది. అయితే ఈ సారి బీహార్‌లో రాహుల్ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ ఆ పార్టీకి మం చి బలాన్నిచ్చినట్లుగా అనిపిస్తున్నది. మరోవైపు క్రితంసారి ఎన్నికల్లో జే డీయూ 43 చోట్ల గెలవగా.. బీజేపీ 73 స్థానాలు గెలిచింది.
అయితే ఈ సారి 243 అసెంబ్లీ స్థానాల్లో కొన్ని సీట్లను మిత్ర పక్షాలకు కేటాయించి మిగిలిన సీట్లను చెరి సమానంగా పంచుకోవాలని బీజేపీ, జేడీయూ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే నాలుగసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ మరోసారి సీఎం అయ్యేందుకు ప్రజలపై ఎన్నికల వరాల జల్లు కురిపించారు.
గత ఎన్నికల్లో జేడీయూ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ నితీశ్‌కే సీఎం పీఠం అందించామన్న బాధ ఇప్పటికీ బీజేపీ నేతల్లో కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి జేడీయూ ఎక్కువ సీట్లు గెలుచుకోకుంటే మాత్రం నితీశ్ రాజకీయ జీవితం ముగిసేనట్లేనని చాలా మం ది అభిప్రాయపడుతున్నారు. ఇన్ని విధాలుగా కీలకంగా మారిన బీహార్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎటువైపు మొగ్గుతారానేది రానున్న నెలన్నర రో జుల్లో తేలిపోనుంది.