18-09-2025 12:03:11 AM
ఎల్బీనగర్, సెప్టెంబర్ 17 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. బుధవారం ఉదయం విగ్రహాన్ని చూసిన పలువురు ఆందోళన చేపట్టా రు. విషయం తెలుసుకున్న దళిత, మాల సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్(బాలన్న), లింగోజిగూడ అంబేద్కర్ యువజన సంఘం కామిల వెంకటరమణ, ఆర్.జగదీష్, నాగరాజ్, అశోక్, చౌదరి, పెంటయ్య, జవాది ఆనంద రాజ్, శ్రీధర్ తదితరులు డిమాండ్ చేశారు.
విష యం తెలుసుకున్న ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణ య్య, సరూర్ నగర్ సీఐ సైదిరెడ్డి తమ బలగాలతో సంఘటనా స్థలానికి వచ్చి ఆందో ళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని దదళిత, మాల సంఘాల నేతలు పోలీస్ అధికారులకు ఫిర్యాదు పత్రం అందజేశారు.
కాగా, మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.-
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డితోపాటు ఇతర సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. దళిత సంఘ సభ్యుల విజ్ఞప్తి మేరకు త్వరితగతిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.