calender_icon.png 15 September, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధక్షేత్రంలో అమెరికా

24-06-2025 12:00:00 AM

ఇరాన్‌పై దాడులు ప్రారంభించి, పది రోజుల వ్యవధిలోనే నెతన్యా హు అనుకున్నది సాధించారు. యుద్ధక్షేత్రంలోకి అమెరికాను లా గారు. అమెరికా, ఇజ్రాయెల్‌ను అంతమొందించడమే తమ లక్ష్యమని చెపుతున్న ఇరాన్ ఖమేనీలకు ఇప్పుడు అసలు పరీక్ష ఎదురైంది. ఇరాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన బీ2 బాంబర్లతో అమెరికా విరుచుకు పడింది.

ఇరాన్‌లోని ఫోర్డో అణుశుద్ధి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులు, నతాంజ్, ఇస్ఫ హాన్ అణుకేంద్రాలపై తోమహార్ క్షిపణులను ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ పేరుతో దాడులు చేసింది. అణ్వాయుధాలు పెద్ద సంఖ్యలో తయారు చేస్తూ, పశ్చిమాసియాలో శాంతికి విఘాతం కలిపిస్తున్న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవడం తన తక్షణ బాధ్యత అని అమెరికా భావించింది.

దీనితో అణుచర్చలకు తలుపులు మూసుకు పోయాయని ఇరాన్ ప్రకటించింది. అణు కేంద్రాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని, ఇరాన్ ఇప్పటికైనా దారికి రావాలని అమెరికా చెపుతున్నది. ఇజ్రాయెల్‌కు, తమకు మధ్య యు ద్ధంలో తలదూర్చి అమెరికా పెద్ద తప్పు చేసిందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు.

గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఇక దాడులకు పాల్పడదనే గ్యారం టీ లేదు. పైగా, అమెరికా దాడులకు నిరసనగా ప్రపంచ వాణిజ్య మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసి వేయాలని ఇరాన్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికి పోతాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసి వేస్తే అక్కడి నుంచి రవాణా అయ్యే చమురు, సహజవాయువు పలు దేశాలకు నిలిచిపోతాయి.

ప్రపంచ దేశాలకు ఐదింట ఒక వంతు చమురు, 20 శాతం సహజవాయువు అక్కడి నుం చే నౌకల్లో రవాణా అవుతాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలయినప్పటి నుంచి చమురు ధరలు కొండెక్కాయి. ఇప్పుడు హర్మూజ్ నుంచి చమురు రవాణా ఆగిపోవచ్చునన్న భయంతో సోమవారం ఆసియా మా ర్కెట్లలో భారీగా చమురు ధరలు పెరిగాయి. ఇక, అంతకంతకూ పరిస్థితులు చమురు సంక్షోభం దిశగా వెళ్లే రోజులు దగ్గర్లోనే కనిపిస్తున్నాయి.

యుద్ధక్షేత్రంలోకి అమెరికా పూర్తిస్థాయిలో ప్రవేశిస్తే అప్పుడు యూరప్ దేశాలు అగ్నిలో తలా ఓ సమిధ వేయక మానవు. ఇరాన్‌కు ఆయుధాలు అందించేందుకు రష్యా, అణ్వాయుధ తయారీలో చైనా ముందుకు వస్తే జరిగేది మూడో ప్రపంచ యుద్ధమే. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌ే ఇరాన్ యు ద్ధాలు ఆ దేశాలకే పరిమితమైతే ప్రపంచ దేశాలకు పెద్ద సమస్య కాదు. కాని, అణుచర్చలు, ఆర్నెళ్ల దాకా చూస్తాం...

అంటూ పొంతన లేని  ప్రకటనలిచ్చిన ట్రంప్ హఠాత్తుగా రణరంగంలోకి అడుగు పెట్టడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నది. ఈ యుద్ధ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం తటస్థ వైఖరిని అవలంభించడం కాంగ్రెస్ పార్టీ విమర్శలకు తావిస్తున్నది. గల్ఫ్ ప్రాంతంలో భారతీయులు సుమారు 90 లక్షల మంది వరకు ఉన్నారు. వారి భద్రత ప్రస్తుత తక్షణావసరం. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్‌తో భారత్ దౌత్య సంబంధాలను ఇప్పటికీ స్థిరంగా కొనసాగిస్తున్నది.

యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్ విదేశాంగ విధానానికి పెద్ద సవాళ్లే ఎదురు కానున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న భారతీయులను క్షేమంగా స్వదే శానికి తీసుకువచ్చే పనిని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. మొత్తంగా గల్ఫ్ నుంచి మన వారినందరినీ స్వదేశానికి చేర్చడం తలకు మించిన భారం కానుంది.