calender_icon.png 15 September, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకదిన ప్రబంధ రచనాదక్షుడు మరింగంటి సింగరాచార్యులు

23-06-2025 12:00:00 AM

రెండు కావ్యాలూ రామకథాంశాలే!

రచించిన రచనలు 17 అయినా మరింగంటి సింగరాచార్యుల వారి మూడు రచనలు మాత్రమే లభిస్తూ ఉండటం సాహిత్యప్రియులను బాధించే అంశమే. అయినా ఈ మూడు రచనల్లో కవి ప్రతిభకు మనం ఆశ్చర్యపోతాం. ముఖ్యంగా ‘దశరథ రాజనందన చరిత్ర’ కేవ లం నిరోష్ఠ్య కావ్యమైతే, ‘సీతాకల్యాణం’ అచ్చ తెనుగులో రచించిన నిరోష్ఠ్య కావ్యం. రెండూ రామకథాంశాలే. అంటే రామాయణంపై కవికి వున్న గౌరవభావం తెలుస్తున్నది. 

“వరవందారు జనావళీ హృదయ 

సద్వాంఛార్థ కృద్వేంక టే

శ్వర సంపూర్ణ కృపాసుధామిళిత 

వీక్షామాధురీ మార్గ వి

స్ఫురితైకైక దిన ప్రబంధరచనా 

స్ఫుర్జ చ్వజ శ్రీ్శకుడన్

నరనాగాశ్వ నృపాల సభ్య 

గణితుండన్ సింగరాచార్యుడన్‌”

అని చెప్పుకున్న కవి ‘దశరథ రాజనందన చరిత్ర’ అనే నిరోష్ఠ్య కావ్య రచయిత శ్రీమత్ ఆసూరి మరింగం టి సింగరాచార్యులు. ‘దశరథ రాజనందన చరిత్ర’లోని ఈ పద్యం ఆయ న ఘనతను తెలుపుతున్నది. తాను శ్రీ వేంకటేశ్వరస్వామి కృపాపాత్రుడన ని, తెలుగు కవితాప్రియుల హృదయాలను పులకింపజేసే రచనలు చేయగలిగిన వాడనని, ఏకైక దినప్రబంధ రచనా ధురీణుడనని ‘నర నాగాశ్వ నృపాలు’రతో సన్మానములను అందుకున్న వానినని తన కవితా ప్రాగాల్భ్యాన్ని చాటుకున్నాడు. ఎనిమిది భాషలలో ప్రఖ్యాతుడు, ఆశుకవి, శతఘంటావధాన, శారదా ప్రశ్న వివరణ వంటి అనేక గౌరవాలతో భూషితుడైన ‘మరింగంటి’ వంశోద్భవుడైన సింగరాచార్యులు దాదాపు 17 కృతులు చేసి నట్లు తెలుస్తున్నది.

నమ్మిన దైవానికే అంకితం

సాధారణంగా ఒక కుటుంబంలో ఎవరో ఒకరిద్దరు కవులు ప్రఖ్యాతి వహిస్తుంటారు. ఆ కుటుం బాల్లో కొందరు మాత్రమే కవులై కవిత్వరంగంలో రాణిస్తుంటారు. కాని, తెలుగు సాహిత్యరంగంలో తాళ్లపాక కవులు, మరింగంటి కవులు తరతరాలు గా కవితా ప్రపంచంలోనే ఉంటూ అపురూప సాహిత్యాన్ని తెలుగు సాహితీ ప్రపంచానికి అందించడం ఒక విశేషం.

తాతల తరం మొదలు మను మలత రం వరకు కూడా కవిత్వాన్నే జీవితంగా, తాము విశ్వసించిన దైవానికే తమ సాహిత్యాన్ని అంకితం ఇచ్చిన వారు మరింగంటి కవులు. పాలకుల ఆశ్రయాల్లో తమ జీవితాలను గడిపినా ఏ పాలకునికీ ఒక్క రచనను కూడా అంకితం చేయని మరింగంటి కవులలో సుప్రసిద్ధుడైన కవీశ్వరుడు మరింగంటి సింగరాచార్యులు.

మరింగంటి సింగరాచార్యులు 9 సంవత్సరాల వయసు నుంచే కావ్యరచన ప్రారంభించినట్లు ఆయ న తన రచనల అవతారికల్లో రాసుకున్న ప ద్యాలనుబట్టి 17 రచనలు తెలుస్తున్నాయి. ఈయన రచిం చిన వరదరాజ స్తుతి (9 ఏళ్లప్పుడు) తరువాత శ్రీరంగ శతకము, చక్రలాంఛన విధి, కవి కదంబ ము, శత సంహిత, రామకృష్ణ విజయము (ద్వర్థికా వ్యం), అష్టభాషా విశేష కృతులు, నాటక శాస్త్ర ము, ధనాభిరామము, ప్రేమాభిరామము, నలయాదవ రాఘవ పాండవీయము (నాలుగర్థాల కావ్యం), సకలాలంకార సంగ్రహము, ఆంధ్రభాషా భూషణము, దశరథ రాజనందన చరిత్ర, శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకళ్యాణము, తారక బ్రహ్మ రాజీయము అనే ఈ 17 రచనల వివరాలు ‘సీతా కల్యాణము’లోని పద్యాలనుబట్టి తెలుస్తున్నది. 

అయితే, ఇందులో కేవలం ‘దశరథ రాజనందన చరిత్ర’, ‘శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణము’, తారకబ్రహ్మ రామశతకమను మూడు రచనలు మాత్ర మే లభించినవని సుప్రసిద్ధ సాహితీ పరిశోధకులు, మరింగంటి కవుల సాహిత్యసేవను గురించి కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన శ్రీమాన్ డా.పెరుంబుదూ రు శ్రీరంగాచార్య తెలియజేశారు.

వారి పరిష్కారంతోనే ‘దశరథ రాజనందన చరిత్ర’ గ్రంథాన్ని నాటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు వెలువరించారు. ‘శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణ’ కావ్యం కూడా వారి పరిష్కరణలోనే వెలువడింది. పై రెండు కావ్యాల్లోని అవతారికల్లో విషయాలనుబట్టి సింగరాచార్యుల వారి కుటుంబ విశేషాలు తెలుగువారికి తెలుస్తున్నాయి.

పండిత కుటుంబం

మరింగంటి వారిది పండిత కుటుంబం. తొలుత వీరు ఆసూరి వారు. ఆసూరి రామానుజాచార్యులవారు కూరేశ భట్టారకుల వారితో కలిసి శ్రీరంగాన్ని దర్శించుకున్నప్పుడు, ఆ రంగనాథ స్వామియే

“కంటిమి మిము గూరేశుల

గంటిమి మీ వెంటవచ్చు ఘనులెవరొ మరిం

గంటిమని బల్కి నిది మా

కింటిపేరుంట నామహిన్ రహికెక్కెన్‌”

అన్నాడట. అని మరింగంటి వేంకట నరసింహాచార్యుల వారు తమ కావ్యమైన ‘తాలాక నందినీ పరిణయ’ కృతిలో చెప్పిన విధంగానే సింగరాచార్యులు కూడా ‘దశరథ రాజనందన చరిత్ర’లో

“కంటిన్ లక్ష్మణ మునివరు

గంటిన్ గూరేశ దేశికస్వామి మఱిం

గంటిన దెవ్వరన మరిం

గంటి మహాన్వయము దనరె గణ్యం బగుచున్‌”

అంటూ చెప్పిన పద్యం స్ఫురిస్తుంది. సింగరాచార్యుల వారి తరువాతి వాడైన మరింగంటి వేంకట నర సింహాచార్యుల వారుకూడా ఈ విషయాన్నే ఇదే రీతి లో చెప్పడం మరింగంటి గృహనామ కథనాన్ని ధ్రువ పరుస్తున్నది.ఇదే విషయాన్ని ‘జనకాభ్యుద యం’ వంటి కావ్యాలు కూడా వివరించడం ఒక విశేషం.

సంతానంలో ఆరవ వాడు!

మరింగంటి చెన్నయాచార్యులు, ఆప్పలాచార్యు లు, జగన్నాథాచార్యులు, వేంకట నరసింహాచార్యు లు, చెన్నకృష్ణమాచార్యులు, అప్పల దేశికులు, వేంక ట రాఘవాచార్యులు వంటి ఎందరో దిగ్దంతుల వంటి వైష్ణవ ధర్మానుయాయులైన పండితులు జన్మించిన ఈ మరింగంటి వంశంలో ప్రతిభామూర్తియైన సింగరాచార్యుల వారుకూడా జన్మించారు.

సింగరాచార్యుల వారి తల్లిదండ్రులైన మరింగంటి తిరువేంగళాచార్యులు, వరదాంబలకు ఎనిమిది మంది సంతానం. వారిలో ఆరవవాడు మరింగంటి సింగరాచార్యులు. మరింగంటి అప్పలగురుడు, వేం కటార్యుడు, నరసింహుడు, కోనేటిరాయుడు, జగన్నాథసూరి అనే ఈ అయిదుగురు సింగరాచార్యుల వారి అగ్రజులు. ఆరో సంతానమైన సింగరాచార్యుల వారి తరువాతి ఇద్దరు రంగప్ప, సింగరప్పలు. ఈ వివరాలన్నీ ‘దశరథ రాజనందన చరిత్ర’లోను, ‘శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణం’లోను ఉన్నాయి.

కుతుబ్ షాహీల పాలనలోని కవి

వీరి స్వస్థలం, కాలాన్ని గురించి పండితులు చర్చించారు. అవిభక్త నల్లగొండ జిల్లాలోని కనగల్లు, వాడపల్లి ఈ కుటుంబ నివాసాలని సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. సింగరాచార్యుల కావ్యావతారికల ఆధారంగా డా. శ్రీపెరుంబుదూరు శ్రీ రంగాచా ర్యుల వారు వీరి నివాసాన్ని గురించి విపులంగా చర్చించారు. కుతుబ్ షాహీలు పరిపాలన చేస్తున్న కాలంలో ఈ కవులు జీవించారు.

కుతుబ్ షాహీల కాలంలోని వారైన మరింగంటి కవులు వారి కొలువులో గొప్పగా పేరు పొందారు. మరింగంటి అప్ప లాచార్యుల వారినుంచే నాటి పాలకుల నుంచి గౌరవాలందుకున్న కవుల పేర్లు ఎక్కువగా వినిపించుచు న్నది. ఈ అప్పలాచార్యుల వారు ముగ్గురు రాజుల తో మొక్కులు గొన్నట్టి భగవత్సమానుడని ‘దశరథ రాజనందన చరిత్ర’ తెలుపుతున్నది.

మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యకర్తగా కీర్తిని అందుకున్న ‘యయాతి చరిత్ర’ కావ్యకర్త పొన్నకంటి తెలుగన్నకు మొదటినుంచి ప్రోత్సాహాన్నిచ్చి ఆయన రచనను అమీర్ ఖానునికి అంకితమిచ్చేటట్టు సాయం చేసిన వ్యక్తి మరింగంటి అప్పలాచార్యుల వారే అనడానికి తెలగన్న కావ్యావతారికలో చెప్పుకున్న పద్యాలే తార్కాణాలు. ‘ఇభరాముని’గా కీర్తి గడించిన ‘మత్కిభరాం’ అనే ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో వు న్న తెలుగు కవులందరిలో అప్పలాచార్యుల వారుకూడా ఒక ముఖ్యడు కావడం విశేషం.

మరింగంటి కవుల లక్ష్యం వైష్ణవ ధర్మ ప్రచారం. వారి అనురక్తి యావత్తూ భగవద్భక్తిపై మాత్రమే. తాము రాజాస్థానాలలో ఉన్నా ఏ రచననూ ఏ మరింగంటి కవీ ఎప్పుడూ రాజాంకితం చేయలేదు. అన్నీ భగవదంకితాలే కావడం భగవంతునిపట్ల వారి నిబద్ధతకు నిదర్శనం.

తొలి నిరోష్ఠ్య కావ్యం!

మరింగంటి సింగరాచార్యుల వారి నిరోష్ఠ్య కావ్యమే తెలుగు సాహిత్యంలో తొలి నిరోష్ఠ్య కావ్యం. ఆ సంగతి కవి పేర్కొన్న

“మును రామాయణమున్ 

నిరోష్ఠ్యముగ నింపుల్మీర శాకల్య మ

ల్లన తా సంస్కృతభాష జేసెనన 

నాలావుల్ చెవుల్నిండగా

వినుటేగాని, ధరిత్రిపై నిజముగా వీక్షింపలేదట్టి దే

దెనుగుంజేసెద నెల్లెడంగవులకున్ 

దృష్టాంతమై యేర్పడన్‌”

అనే ఈ పద్యాన్నిబట్టి ఈయనకు పూర్వం ఒక్క శాకల్య మల్లన్న సంస్కృతంలో నిరోష్ఠ్య కావ్యం రాశాడని, కాని అదీ అలభ్యమని చెప్పడం పరిశీలిస్తే తెలుగులో సింగరాచార్యులే తొలి నిరోష్ఠ్య రచన చేసిన తెలుగు కవిగా గుర్తించవచ్చు. ఈ పద్యం చదవగానే పింగళి సూరన ద్వ్యర్థి కావ్య విషయం చెప్పే టప్పుడు “భీమన తొల్లి జెప్పే నను మాటయె గాని.. ” అన్న పద్యం స్ఫురిస్తుందని సుప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు కీ.శే. ఆరుద్ర అన్నారు.

సింగరాచార్యుల వారు ‘దశరథ రాజనందన చరిత్ర’లోనేగాక ‘శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణం’లోనూ అచ్చతెను గు నిరోష్ఠ్య రచనల విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రతిభావంతుడైన కవి గనుక ఇటువంటి ప్రయోగాలకు సాహసించిన కవి సీతాకల్యాణంలో 

“ఇల కవితా ప్రయాసమగు నెన్నిక మై 

యుభయార్థ కావ్యముల్

గల విపుడిట్లు విన్నయది గద్దిక 

ముందరగల్గ నేర్చునే

దెలుగు నిరోష్ఠ్య పుంగృతి యిదే 

మఱిదక్కగ నిప్పటందులన్

గలుగదు వింటతేజ యిక కాగల 

జాడలు నెన్ననేటికిన్‌”

అన్న పద్యాన్నిబట్టి తెలుగులో ద్వ్యర్థి కావ్యాలు ఉన్నాయి గాని అచ్చతెనుగు నిరోష్ఠ్య కావ్యాల్లో ఇదే మొదటిదని స్పష్టపరిచాడు.

‘యయాతి చరిత్ర’కు పూర్వమే

తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యమైన ‘యయాతి చరిత్ర’కు పూర్వమే సింగరాచార్యుల అచ్చ తెనుగు కావ్యమే తొలుత వచ్చి వుండవచ్చునేమో అని కొన్ని ప్రమాణాలను డా.శ్రీరంగాచార్య ప్రతిపాదించి వివరించారు.అయితే, కేవలం ఇటువంటి ప్ర యత్నమేగాక బంధకవిత్వ రచనలోనూ ఆచార్యుల వారు నిష్ణాతులు. ‘దశరథ రాజనందన చరిత్ర’లో

“నరహరి ధీర సూరివర నారద వర్ణితగానలోల శ్రీ

వరకరుణా విచారకరి వైరిహర స్థిర భోగపావనా!

నిరత నవీన హారధర నీరజపద్మ విహార భూరతా!

హరినగ జాత సారసుత యాతల లంఘన చారువాససా!”  

అంటూ రాసిన నాగంబంధంతోపాటు మరో ఖడ్గబంధం కూడా రచించి అలరించాడు. 

ప్రపథమంగా నల్లగొండ జిల్లా మరింగంటి వారి కవితా జన్మభూమి అయినా క్రమంగా ఈ వంశానికి సంబంధించిన కవితా కుటుంబాలు కరీంనగర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, నిజామాబాద్ జిల్లా, విశాఖపట్నం జిల్లా, హైదరాబాద్ జిల్లా  మొదలైన ప్రాంతాలకేగాక శ్రీకాకుళం, రంగారెడ్డి జిల్లాల్లో కూడా నేటికీ కనిపిస్తారు. నిరంతర వైష్ణవ భక్తికే అంకితమైన ఆసూరి మఱింగంటి వంశం చిరస్మరణీయమై ఎందరో ప్రతిభా సంపన్నులైన కవీశ్వరుల కుదురై నిలిచి వెలిగింది.