26-07-2025 12:00:00 AM
సిద్దిపేట, జులై 25(విజయక్రాంతి): పంటల సాగులో తప్పనిసరిగా వినియోగించే సాంప్రదాయ యూరియాకి రైతులు స్వస్తి పలికిన సందర్భంగా నెలకొన్నది. ద్రవపదార్థంగా ఉన్న యూరియా లిక్విడ్ గా రూపాంతరం చెందింది దాంతో అనేక లాభాలు ఉన్నాయి అంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. రైతుల భవిష్యత్తు మారుస్తుందని చెప్పబడుతున్న నానో యూరియా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.
సాధారణ యూరియాకు ప్రత్యామ్నాయంగా తయారైన ఈ ద్రవ ఎరువు, పంటల అభివృద్ధికి నూతన దిక్సూచి అవుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక లిక్విడ్ ఫార్మ్ లో ఉండే నానో టెక్నాలజీ ఆధారిత ఎరువు. 500 మిల్లీలీటర్ల బాటిల్ లో ఇది లభిస్తుంది. ఒక బాటిల్ నానో యూరియా, సుమారు 45 కిలోల సాదారణ యూరియాకు సమానం.
వినియోగించే విధానం...
నానో యూరియాను నీటిలో కలిపి ఫోలియర్ స్ప్రే రూపంలో మొక్కలపై పిచికారీ చేయాలి. మొక్కల ఆకుల ద్వారా ఇది నేరుగా శోషించబడుతుంది. ఈ విధానం వల్ల మట్టిలో మార్పులు ఉండవు, అలాగే సమర్థవంతంగా మొక్కలు పోషకాలను పొందతాయి.
నానో యూరియా వల్ల లాభాలు:
పంటలకు అవసరమైన నత్రజని శాతం తక్కువ మొత్తంలోనే అందుతుంది. మట్టికి హానీ కలిగించే ఘన యూరియా వాడకాన్ని తగ్గించవచ్చు. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.రవాణా, నిల్వ ఖర్చులు తగ్గుతాయి. రైతుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
తప్పని సరిగా వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మోతాదులోనే పిచికారీ చేయాలి. వాన పడే పరిస్థితుల్లో ఉపయోగిస్తే ప్రభావం తగ్గుతుంది.మట్టి తత్వాన్ని బట్టి ఫలితాల్లో తేడా ఉండొచ్చు. కొన్ని పంటలకే ప్రస్తుతానికి పరిమిత ప్రయోగాలు మాత్రమే జరిగాయి, వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలకు మాత్రమే పిచికారి చేయాలి.
నానో యూరియా వ్యవసాయంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. అయితే దీన్ని సమర్థవంతంగా ఉపయోగించాలంటే రైతులు అవగాహనతో, సూచనల ప్రకారం వినియోగించాలి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ నూతన ఎరువు విస్తృతంగా రైతుల మధ్య విస్తరించే అవకాశాలు ఉన్నాయి.